33 మండలాలు, 680 గ్రామాలతో నుడా
నుడా (నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 33 మండలాలు, వాటి పరిధిలోని 680 గ్రామాలను ‘నుడా' పరిధిలోకి తెస్తూ ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. భారీస్థాయిలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు సమగ్రాభివృద్ధిలో భాగంగా ‘నుడా'ను ఏర్పాటు చేయడానికి వీలుగా సన్నాహాలు చేస్తున్నారు.
నెల్లూరు సిటీ : జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, నగర పంచాయతీ అయిన నాయుడుపేట, ఆత్మకూరు, గూడూరు, కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను కలుపుతూ ‘నుడా'ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవే, రైల్వేలైన్, సముద్రతీరాలకు దగ్గరగా ఉండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలపనున్నారు.
నెల్లూరు నగరానికి పరిసర ప్రాంతాలైన తొమ్మిది మండలాలతో ముందుగా ‘నుడా’ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలను తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 33 మండలాలతో కూడిన నుడాను ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది.
దీంతో అధికారులు డెవలప్‌మెంట్ ప్రాంతాలైన 33 మండలాలను కలుపుకుని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ‘నుడా’ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. 33 మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. మరిన్ని మండలాలు కలిపే అవకాశం ఉంది.
33 మండలాలివే..
కోవూరు, బుచ్చి, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, నెల్లూరు రూరల్, మనుబోలు, విడవలూరు, కొడవలూరు, కావలి, జలదంకి, బోగోలు, అల్లూరు, దగదర్తి, గూడూరు, సైదాపురం, చిల్లకూరు, ఓజిలి, వెంకటగిరి, బాలాయపల్లి, నాయుడుపేట, పెళ్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, వాకాడు, కోట, ఆత్మకూరు, సంగం, చేజర్ల.
నుడాలో కలవని 13 మండలాలు (మేజర్ పంచాయతీలు)
డక్కిలి, రాపూరు, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, కలిగిరి, అనుమసముద్రం, ఏస్‌పేట. ఈ 13 మండలాల్లో అభివృద్ధి తక్కువగా ఉందనే ఉద్దేశంతో వీటిని రూరల్ ఏరియాగా డెవలప్‌మెంట్ చేయనున్నారు.
నగర పరిధిలో రింగ్‌రోడ్డు
నగర పరిధిలోని దాదాపు 60 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రవాణాకు అంతరాయం లేకుండా ఉంటుంది. కోవూరు మండలం హైవే నుంచి మైపాడురోడ్డు, బుజుబుజునెల్లూరు, కొత్తూరు మీదుగా పొదలకూరురోడ్డు వరకు రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.
ఇప్పటి వరకు ఉన్న అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు:
విశాఖపట్టణం- ఉడా
తిరుపతి - తుడా
పుట్టపర్తి - పుడా
విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిని కలిపి - వీజీటీఎం
పాలకవర్గం: ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 13 మంది సభ్యులతో ‘నుడా’ పాలకవర్గం ఏర్పాటు అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ డెవలప్‌మెంట్ యాక్ట్ 1975 కింద 15 మంది సభ్యులతో కూడిన ‘నుడా’ను ఏర్పాటు చేయాలి.
చైర్మన్- ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తి.
వైస్ చైర్మన్- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
సభ్యులు-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల నుంచి గెలుపొందిన ఐదుగురు సభ్యులు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ఆఫీసర్
టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ఆఫీసర్
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ఆఫీసర్.
ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు వ్యక్తులు.