కాకినాడ రూరల్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న జరిగిన బంద్‌లో దళిత యువకులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని జిల్లా దళిత ఐక్యవేదిక డిమాండ్ చేసింది. శనివారం కాకినాడ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దళిత ఐక్యవేదిక నాయకులు టి.నూకరాజు, న్యాయవాది కె.ఉదయ్‌కుమార్, బచ్చల కామేశ్వరరావు, తాడి బాబ్జీ, సిద్దాంతుల కొండబాబు, బయ్యా రాజేంద్రకుమార్, ఎన్.కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. మానవీయ దళిత హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్సీ యువకులపై తూటాల వర్షం కురిపించి ప్రాణాలు బలిగొన్న పోలీసు హంతకులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తించదా అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులందు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులను వెంటనే నియమించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ప్రతి ఉద్యోగి ఆ చట్టం పూర్వస్థితిని కొనసాగించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రపతి రీకాల్ చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయాలన్నారు. ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు పరిహారం చెల్లించి కుటుంబం ఒక్కంటికి 10 ఎకరాల భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 10న అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భావి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment