న్యాయవిచారణ జరపాలి: వాసిరెడ్డి పద్మ
* రాజధాని వ్యవహారాలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్
* ‘మెకెన్సీ’ రూపొందించిన చట్టాలను ఆమోదించినందుకు బాబు సర్కారు సిగ్గుపడాలి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వరూపం, నిర్మాణం విషయాన్ని అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీ ‘మెకెన్సీ’ చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమన్నారు.
బ్రిటన్, ఆమెరికాతో ఆత్మీయంగా మెలిగే ‘మెకెన్సీ’ రూపొందించిన సీఆర్‌డీఏ ఏర్పాటు బిల్లును శాసనసభలో నెగ్గించుకోవటంపై చంద్రబాబు సర్కారు సిగ్గుపడాలన్నారు. నాసా, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయ మేధావులను అగ్రస్థానాల్లో కూర్చోబెడుతుంటే రాజధాని నిర్మాణం అంశాన్ని చంద్రబాబు ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. సింగపూర్ సంస్థలకు చెందిన వారిని రాజధాని గ్రామాల్లో రహస్యంగా ఎందుకు తిప్పుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ భయం పట్టుకుందన్నారు. అమిత్‌షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా చంద్రబాబును కనీసం కలవడానికి కూడా ఆసక్తి చూపలేదన్నారు.