ఆంధ్రప్రదేశ్ రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఏడీపీ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న కీలక తీర్పును ఇస్తూ స్విస్ ఛాలెంజ్ విధానం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు నిక్కచ్చిగా అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌పై చంద్రబాబు బదిలీ వేటు వేసి కక్ష తీర్చుకున్నారు.
*మార్గదర్శకం 1: స్విస్ ఛాలెంజ్ విధానం కింద ఏ తరహా ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి.
ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నది ఇప్పటివరకూ గుర్తించలేదు. బహిరంగ ప్రకటన చేయలేదు.
*మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు.
ఉల్లంఘన: రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే ఒప్పందం కుదిరిన సమయంలోనే సింగపూర్ ప్రభుత్వం సూచించిన సంస్థలనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు సింగపూర్ సంస్థల కన్సార్టియం చెప్పినట్టల్లా ప్రభుత్వం తలాడించింది.
*మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు.
ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్‌లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం. ఇదే అంశాన్ని ఇటీవల హైకోర్టు తప్పుబట్టడంతో.. అర్హత సాధించిన వారికి ఆ వివరాలను వెల్లడిస్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.
*మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి.
ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు.
*మార్గదర్శకం 5: ఓపీపీతోపాటూ కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. కానీ.. టెండర్‌లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు.
సుప్రీం మార్గదర్శకాలు తుంగలోకి..
Published Tue, Sep 13 2016 1:27 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement