‘సుప్రీం’ తీర్పునకూ తూట్లు!
స్విస్ చాలెంజ్‌పై కోర్టు ఆదేశాలు పట్టించుకోని బాబు సర్కార్
- అత్యున్నత న్యాయస్థానం తీర్పులో అనేక మార్గదర్శకాలు
- వాటిని వివరిస్తూ రాష్ర్ట ఆర్థిక శాఖ సర్క్యులర్..
- అన్నిటినీ తుంగలో తొక్కిన రాష్ర్టప్రభుత్వం
- జీటూజీకి ఓకే చేసిన కేంద్రప్రభుత్వానికీ టోకరా
- మనకు 51% వాటా ఉండాలన్న ఏపీఐడీఈ చట్టం బుట్టదాఖలా
- చివరకు ‘స్విస్ చాలెంజ్’ నియమాలనూ ఉల్లంఘించిన సీఎం
- {పయివేట్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మంతనాలు..
- సింగపూర్ కంపెనీల మేలు కోసమే అన్ని ఉల్లంఘనలు...
స్విస్ చాలెంజ్ విధానం పారదర్శకంగా లేదు. దీనిపై కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. చేపట్టే ప్రాజెక్టుల గురించి అందరికీ తెలిసేలా ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించాలి.
- సుప్రీంకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ విధానంపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుట్టదాఖలా చేసిందా? ‘స్విస్ చాలెంజ్’పై సుప్రీంకోర్టు తీర్పును, మార్గదర్శకాలను ఉటంకిస్తూ రాష్ర్ట ఆర్థికశాఖ విడుదల చేసిన సర్క్యులర్‌ను పరిశీలిస్తే అవుననే స్పష్టంగా అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు తూట్లు పొడుస్తూ స్విస్ చాలెంజ్‌ను అమలు చేస్తున్నట్లు బట్టబయలైంది. స్విస్ చాలెంజ్ విధానంలో ఏ కొంచెం కూడా పారదర్శకత లేదని సుప్రీంకోర్టు ఏనాడో స్పష్టం చేసినా రాష్ర్టప్రభుత్వం ఆ విధానాన్నే తలకెత్తుకోవడంపై అందరిలోనూ ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.
పారదర్శకత లేదన్న స్విస్ చాలెంజ్‌ను తలకెత్తుకోవడమే కాకుండా సుప్రీం మార్గదర్శకాలను సైతం పూర్తిగా పక్కన పెట్టి స్వప్రయోజనాలే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇక ‘స్విస్ చాలెంజ్’ విధానాన్నయినా సరిగా పాటిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రాజెక్టు భాగస్వామ్య కంపెనీలతో నేరుగా మాట్లాడకూడదని స్విస్ చాలెంజ్ చెబుతోంది. కానీ సీఎం చంద్రబాబు దానినీ ఉల్లంఘించారు.. సుప్రీంకోర్టు తీర్పును, ఆర్థికశాఖ సర్క్యులర్‌లోని మార్గదర్శకాలను పరిశీలిస్తే రాష్ర్టప్రభుత్వం వాటికి భిన్నంగా ఎలా అడుగులు వేస్తున్నదో, అన్నిటినీ ఎలా ఉల్లంఘిస్తున్నదో అర్ధమౌతుంది.
సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య (జీటూజీ) ఒప్పందమని ముందు చెప్పారు. కేంద్రం సరేనంది. అంతే.. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి ఆ దేశ ప్రయివేటు కంపెనీలను రంగంలోకి దించారు. కేంద్రాన్ని మోసగించారు. రాష్ర్టప్రభుత్వానికి ఈ ప్రాజెక్టులో 51% వాటా ఉండాలని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల కల్పన (ఏపీఐడీఈ) చట్టానికీ తూట్లు పొడిచారు. అసలు ఎందుకు ఇన్ని ఉల్లంఘనలు? కేంద్రాన్ని, ఏపీ చట్టాన్ని, ఆర్థిక శాఖ అభ్యంతరాలను, చివరకు సుప్రీం తీర్పును ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? సింగపూర్ కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నడుచుకుంటున్నారు? ఇంతకూ స్విస్ ఛాలెంజ్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?.. దాని ఆధారంగా ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో ఏముంది?.. వాటిని రాష్ర్టప్రభుత్వం ఎలా ఉల్లంఘించిందో చూద్దామా...
సుప్రీం తీర్పునకు తూట్లు పొడిచారిలా...
స్విస్ చాలెంజ్ విధానంపై 2009 మే 11వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. స్విస్ చాలెంజ్ విధానం పారదర్శకంగా లేదని స్పష్టంచేసింది. కొన్ని మార్గదర్శకాలను వెల్లడిస్తూ వాటిని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
► స్విస్ చాలెంజ్ విధానంలో ఏ ఏ ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలాగ పారదర్శకంగా ప్రభుత్వం ప్రకటించాలి. కానీ ఏఏ ప్రాజెక్టులను స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టనున్నదీ ప్రభుత్వం ప్రకటించలేదు.
► స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎవ్వరికీ ప్రభుత్వం ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపరాదు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పలు సార్లు సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అలాగే వారితో సంప్రదింపులు జరిపేందుకు ఏకంగా మం త్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యమంత్రి, అటు మంత్రులు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో మంతనాలు జరిపారు.
► సుప్రీం తీర్పు ఆధారంగా ఆర్థికశాఖ సర్క్యులర్
స్విస్ చాలెంజ్‌పై సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను తప్పనిసరిగా పాటించాలంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీ.వీ.రమేశ్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సర్క్యులర్ జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలను, మార్గదర్శకాలను ఆ సర్క్యులర్‌లో వివరించారు. అవి ఏమిటంటే..
► స్విస్ చాలెంజ్ విధానంలో అన్యాయం జరిగేందుకు, సందిగ్ధతకు, చెడు ప్రభావాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇటువంటి వాటిని నివారించేందుకు తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలను పాటించాలి.
► స్విస్ చాలెంజ్ విధానంలో ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారో చాలా ముందుగా పూర్తి వివరాలతో బహిరంగంగా ప్రకటించాలి.
► ఎటువంటి ప్రాజెక్టులు స్విస్ చాలెంజ్ విధానంలోకి వస్తాయో స్పష్టం చేయాలి.
► స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలతో నోటిఫై చేయాలి. ఆ ప్రాజెక్టులకు ఎవరిని సంప్రదించాలో కూడా నోటిఫై చేయాలి.
► స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టులను ఆమోదించడానికి నిర్ధిష్ట సమయాన్ని, నిబంధనలను ముందుగానే ప్రకటించాలి.
► ప్రాజెక్టులను ఆమోదించిన తరువాత కూడా స్విస్ చాలెంజ్ విధానంలో నియమనిబంధనలను సంబంధిత అధికారులు పాటించాలి.
► స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల్లో అందరూ పాల్గొనేలాగ అందరికీ సమాన అవకాశాలను కల్పించాలి.
► ప్రస్తుత నిబంధనలకన్నా మెరుగైన మరింత పారదర్శకత విధానాలుంటే అమలు చేయాలి.
► స్విస్ చాలెంజ్ విధానంలో కంపెనీలు తమంతట తాముగా ప్రాజెక్టును ఎంతకు చేపడతాయో తెలియజేయాలి. ప్రభుత్వం ఎలాంటి వివరాలను అందజేయరాదు.
రాష్ర్టప్రభుత్వ ఉల్లంఘనలివీ..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే కాదు ఏపీఐడీఈ చట్టాన్ని, చివరకు స్విస్ చాలెంజ్ విధానాన్ని కూడా రాష్ర్టప్రభుత్వం ఉల్లంఘించింది.
► సుప్రీం కోర్టు తీర్పులోని మార్గదర్శకాల మేరకు స్విస్ చాలెంజ్‌లో ఏ ప్రాజెక్టులను చేపట్టేదీ ముందుగా ప్రకటించలేదు.
► స్విస్ చాలెంజ్ విధానం రూల్స్, రెగ్యులేషన్స్‌ను ప్రకటించలేదు.
► స్విస్ చాలెంజ్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులను నోటిఫై చేసి విస్త్రృత ప్రచారం కల్పించలేదు.
► స్విస్ చాలెంజ్‌లో పాల్గొనే సంస్థలు తమంతట తాముగా ప్రతిపాదనలను ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన మాస్టర్ డెవలపర్ సంస్థలను నామినేట్ చేయాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
► సింగపూర్ ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్’ స్థానంలో రాజధాని మాస్టర్ డెవలపర్ సంస్థలుగా సింగపూర్ ప్రైవేట్ సంస్థలైన సెమ్బ్‌కార్ప్, అసెండాస్ సంస్థలు ఏప్రిల్ 30నాటికి తెరపైకి వచ్చాయి.
► గత ఏడాది మే 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ డెవలపర్స్‌గా సింగపూర్ ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది.
► మే 26వ తేదీన అసెండాస్, సెమ్బ్‌కార్ప్ సంస్థలతో సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ర్టప్రభుత్వం అంగీకారం తెలిపింది.
► గత ఏడాది అక్టోబర్ 30న అసెండాస్, సెమ్బ్‌కార్ప్ సంస్థలు 50:50 శాతం చొప్పున స్విస్ చాలెంజ్ విధానం కింద జాయింట్ వెంచర్‌కు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి.
► సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళ్లి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సంప్రదింపులు జరిపారు. తొలుత 50:50 శాతం చొప్పున చేసిన జాయింట్ వెంచర్ ప్రతిపాదనలకు బదులు మరోరకంగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. హా సీఎం కోరిక మేరకు సింగపూర్ సంస్థలు 58:42 శాతం జాయింట్ వెంచర్‌తో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. హా సింగపూర్ సంస్థలు చేసిన రెండో ప్రతిపాదనలపై చర్చించేందుకు బాబు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఈ ఏడాది మే 6వ తేదీన ఏర్పాటు చేశారు.
► ఉన్నత స్థాయి కమిటీ ఈ ఏడాది మే 17, 21, 24,25 తేదీల్లో సింగపూర్ సంస్థల ప్రతినిధులు, సింగపూర్ ప్రభుత్వంతో సమావేశమై చర్చలు జరిపింది.
► ఈ ఏడాది జూన్ 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలిఫోన్‌లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సంప్రదింపులు జరిపారు. ► సీఎం సూచనలమేరకు ఉన్నతస్థాయి కమిటీ జూన్ 9న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఏపీఐడీఈ చట్టాన్నీ ఉల్లంఘించారు...
ఇక ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వ వాటా తప్పనిసరిగా 51 శాతం ఉండాలని పేర్కొనగా అందుకు చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ప్రభుత్వ వాటా కేవలం 42 శాతానికే పరిమితం చేసి సింగపూర్ ప్రైవేట్ కంపెనీల వాటా 58 శాతం ఉండేందుకు అంగీకరించింది. ఏపీఐడీఈ చట్టం ప్రకారం మౌలిక సదుపాయాల అభివృద్ధి అథారిటీ చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తగిన మార్పులు, చేర్పులకు ఆదేశాలు జారీ చేయాలి. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా ముందుగానే సీఎం చంద్రబాబు నాయుడే స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలను ఆమోదించారు.