
బాబూ! ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మోస్తున్నారు?: జూపూడి
హైదరాబాద్: ఈ ప్రభుత్వాన్ని మోయవలసిన బాధ్యత మీకేమిటి? అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యవాదినని చెప్పుకునే ధైర్యం మీకు ఉందా? 18 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఏమైంది? తెలంగాణపై ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకునే దమ్ముందా? కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)కు మీ విధానం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ముమ్మాటికీ విభజన వాదేనని చెప్పారు. ఆయన ఎన్నటికీ సమైక్యవాది కాలేరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని గానీ విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జూపూడి అన్నారు.