సాక్షి, అమరావతి: సమాజంలో నేటికీ జాతి వివక్ష కు గురవుతూ ఎంతో మంది అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. దేశంలో పౌరులందరికీ సమానత్వం అందించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, కానీ ఇప్పటికీ చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో కుల వైషమ్యాలు పోవాలంటే మంచి విద్య విధానం అవసరమన్నారు. అందరూ మనుషులే.. కాని జాతి పేరుతో మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య పరమైన రిజర్వేషన్ అమలు చేయాలంటే జాతి గణన చేయాల్సిందేని ఆయన స్పష్టం చేశారు.
‘దేశంలో జాతి గణన జరగాలి. కులాల పరంగా ఎంత మంది వెనుకబడ్డారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని గతంలో నేను నివేదిక ఇచ్చాను. జాతి గణన జరగనందు వల్లే నేటికీ వర్గీకరణ జరగలేదు. ఆల్మన్ రాజు ను, వెంకటేశ్వరరావు లను బీసీ ఫెడరేషన్ ఎపి శాఖ బాధ్యతలు అప్పగించాను. బీసీలు ఉన్న హక్కులు, అధికారాలను సాధించుకోవాలి. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని అందరూ పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రెండు కమిషన్‌లు వేయడం శుభపరిణామం. బీసీ సంఘాలన్నీ అలాగే ఉంటూ.. మరోవైపు ఫెడరేషన్ తరపున పోరాటాలు చేసి లక్ష్యాన్ని సాధించుకోవాలి. కులవృత్తుల వారు ఎదగకుండా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని ఎదుర్కొని మన హక్కులు ఐక్యంగా సాధించుకోవాలి. నేడు ఎవరి కులాలను వారే చూసుకుంటున్నారు. అందుకే మాయావతికి చెందిన బీస్పీ దేశ వ్యాప్తంగా ఓటమి చెందుతోంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment