
హరిబాబుకి కోపం వచ్చింది
విశాఖపట్నం: విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబుకు కోపం వచ్చింది. దాంతో ఆయన అలిగారు. ఆయన్ని బుజ్జగించేందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి...హరిబాబును బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయిన ఆయన కోపం తగ్గలేదు. దాంతో హరిబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం విశాఖపట్నం నగరంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హరిబాబును ఆహ్వానించారు. అయితే ఆయన్ని మాత్రం వేదికపైకి ఆహ్వానించ లేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. స్థానిక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అంటూ అక్కడే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులను హరిబాబు ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న వారు వెంటనే ఆయన్ని శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. కానీ హరిబాబు కోపంగా అక్కడనుంచి వెళ్లిపోయారు.