కబడ్డీ కోర్టులో కోలాహలం
- ఉల్లాసంగా ‘పో’ ప్రీమియర్ లీగ్
- తెలుగు టైటాన్స్ జయకేతనం
విశాఖపట్నం : ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న యు ముంబ జట్టుతో స్థానిక తెలుగు టైటాన్స్ ఆదివారం ఢీకొంది. ఇరుజట్లు కోర్టుల్లోకి వస్తుంటే అభిమానుల్లో ఒకటే సందండి. టైటాన్స్ జట్టుకు అభిమానులు జేజేలతో స్వాగతం పలికారు. అందుకు తగ్గట్టుగానే తొలి అర్ధ భాగంలో 17 నిమిషాల ఆటలో చెరో పధ్నాలుగు పాయింట్లతో సమవుజ్జీగా నిలిచారు. మరో నిమిషంలోనే మూడు పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
తొలి అర్ధభాగపు ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా రాహుల్ ఒకేసారి నలుగుర్ని ఔట్ చేయడం కొసమెరుపు. తొలి అర్ధభాగాన్ని 22-15తో ఆధిక్యాన్నందుకుని టైటాన్స్ స్థానికుల మన్ననలు పొందింది. తెలుగు టైటాన్స్ తొలి రైడ్ చేసింది. రాహుల్ ైరె డింగ్ చేశాడు. తొలి పాయింట్‌ను దీపక్ తెలుగు టైటాన్స్ తరఫున సాధించడంతో పాయింట్ల వేట ప్రారంభించింది. రాహుల్ రైడింగ్‌లో ప్రతిసారీ పాయింట్‌తోనే తిరిగొచ్చాడు. ఒకేసారి రాహుల్ రైడింగ్‌లో నలుగుర్ని ఔట్ చేయడంతో స్టేడియంలో కోలాహాలమే నెలకొంది. ఒక్కసారిగా ఆధిక్యం ఏడు పాయింట్లకు చేరుకుంది.
యు ముంబ ఆధిక్యానికి తెలుగు టైటాన్స్ బ్రేక్
యు ముంబ ఆధిక్యానికి తెలుగు టైటాన్స్ బ్రేక్ ఇచ్చింది. తొలిసారి మ్యాచ్‌ను గతంలో డ్రా చేయగా, ఈసారి ఏకంగా మ్యాచ్‌నే గెలుచుకుని తెలుగు సత్తాచాటారు. మలి అర్ధభాగంలోనూ టైటాన్సే తొలిపాయింట్ సాధించింది. ఆట మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా 30-25తో ఆధిక్యంలోకి వెళ్లింది. బోనస్ పాయింట్లు సాధించడంలో యు ముంబ చక్కటి ప్రతిభ చూపింది. మరో పదినిమిషాల్లో ఆటముగిసే సమయానికి 13 బోనస్ పాయింట్లను సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొంత సేపు ఆటను తిలకించారు.