అభివాదం చేస్తున్న చంద్రబాబు
సాక్షి, కడప రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జిల్లాకు రాగానే ఆయన వెంట భారీగా పార్టీ నేతలు..శ్రేణులు అనుసరించేవి. అలాంటిది మంగళవారం ఆయన కడప విమానాశ్రయం చేరుకున్నప్పుడు కనీస స్థాయిలో కూడా ఆ పార్టీ నాయకులు కనిపించకుండా పోయారు. జిల్లాలో పేరున్న నాయకులుగా చెలామణి అయిన నేతలు సైతం స్వాగతం పలకడానికి రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి చంద్రబాబునాయుడు మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతూ మంగళవారం ఉదయం కడప విమానాశ్రయంకు చేరుకున్నారు.
ఆయన వెంట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. వారికి ఆ పార్టీ దిగువ స్థాయి శ్రేణులు స్వాగతం పలికాయి. ఎన్నికల ముందు వరకు జిల్లాలో ఆపార్టీ తరఫున అన్నీ తానై వ్యవహరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి పత్తాలేకుండాపోయారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న మరో కీలక నేత జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కూడా విమానాశ్రయం వద్ద జాడలేదు. మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ చైర్మను పుట్టా సుధాకర్ యాదవ్ సైతం చంద్రబాబు స్వాగతానికి డుమ్మా కొట్టారు.
పార్టీ అధినేత స్వాగతానికి కీలక నేతల గైర్హాజరుపై పార్టీలో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆదినారాయణరెడ్డి అదృశ్యం కావడంపై వీరంతా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు పనిగట్టుకొని ఈయన్ను మంత్రిగా చేశారు. మంత్రి కాగానే పార్టీలో సర్వం అయనే నడిపేవారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేవారు. పార్టీ కార్యకర్తలకు ఈ ధోరణినచ్చకపోయినప్పటికీ సర్దుకుపోయారు. ఏమైనప్పటికీ చంద్రబాబుకు ఈ పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించిందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment