అంధులని కూడా చూడకుండా గొడ్డులను బాదినట్లు చిన్న పిల్లలను పట్టుకుని బాదిన సంఘటనలో సామర్లకోట మండలంలోని అంధుల హాస్టల్ మూతపడింది. పిల్లలను చితకబాదుతున్న వీడియోను 'సాక్షి టీవీ' ముందుగా ప్రపంచానికి చూపించింది. అంధుల పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఇద్దరూ కలిసి ముగ్గురు పిల్లలను కొడుతున్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపించడంతో హాస్టల్కు సీలు వేసి, పిల్లలను వేరే ప్రాంతానికి తరలించారు. జాతీయ బాలల హక్కుల కమిషన్కు చెందిన ఇద్దరు సభ్యులు ఈ హాస్టల్ను సందర్శించి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి కూడా నోటీసులు పంపారు.
సాయి(9), సురేంద్ర వర్మ(12), జాన్సన్(13) అనే ముగ్గురు పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ ఆగ్రహించిన కరస్పాండెంట్ కె.వి. రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ (వీళ్లిద్దరూ కూడా అంధులే) వాళ్లు ముగ్గురినీ పేకబెత్తంతో చితకబాదేశారు. ఈ వీడియోను ఒక వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి మీడియాకు అందించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లకు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఈవో శ్రీనివాసులు రెడ్డి ఈ పాఠశాలను సందర్శించారు. పోలీసులు కేసు నమోదుచేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. గాయపడిన పిల్లలను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
పిల్లలను బాదిన హాస్టల్ మూసివేత
Published Tue, Jul 22 2014 12:28 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement