- ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
- గ్రామపాలన అధ్వానంగా మారుతుందంటున్న నేతలు
- కేంద్రం ఆమోదిస్తే జిల్లాలో 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులకు ఎసరు
లేఖ కలకలం
Published Mon, Oct 17 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం జిల్లాలో కలకలం రేపింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లాలోని 1,102 ఎంపీటీసీ, 60 జెడ్పీటీసీ పదవులు రద్దవుతాయి. అదే జరిగితే గ్రామ పాలన మరింత అధ్వానంగా మారుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
మండపేట :
పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మూడంచెలు ఉండేవి. గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ ఉండేవారు. పరిపాలన సౌలభ్యం కోసం 1994లో అప్పటి ప్రభుత్వం మూడంచెల స్థానంలో ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం పై ముగ్గురితోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కూడా తోడయ్యారు. మండల పరిషత్ నుంచి ఎంపీటీసీ సభ్యులకు, జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపులు జరిగేవి. వారు తమ పరిధిలో అభివృద్ధి పనులకు ఆ నిధులు వెచ్చించేవారు. తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జెడ్పీ సమావేశాల్లో ఆయా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఫలితంగా గ్రామ పాలనలో సౌలభ్యం మరింత పెరిగింది. ఇటువంటి కీలక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు రద్దయితే గతంలో మాదిరిగా సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు మాత్రమే కొనసాగుతాయి. గ్రామస్థాయిలో ఎన్నికైన సర్పంచులు మండల స్థాయిలో ఎంపీపీలను ఎన్నుకుంటే, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేవిధంగా మూడంచెల విధానం ఉంటుంది. కాగా, దాదాపు ఆరు నెలలుగా ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపును నిలిపివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తం ఆ పదవుల రద్దుకే పావులు కదుపుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు.. నేడు ఆ పదవులనే రద్దు చేయాలని లేఖ రాయడం ఆయన కుట్ర పూరిత రాజకీయాలకు నిదర్శనం. అధికార వికేంద్రీకరణ జరగకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొన్ని అధికారాల బదలాయింపులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు, విధులు కేటాయిస్తే గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే వ్యవస్థ ఇది. దీనిని రద్దు చేయాలనుకోవడం దురదృష్టకరం.
– సాకా ప్రనన్నకుమార్, జెడ్పీ ప్రతిపక్ష నేత, రావులపాలెం
సరైన ఆలోచన కాదు
జెడ్పీటీసీ, ఎంపీటీసీల వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచన సరైంది కాదు. నాలాంటి గృహిణులు ఈ వ్యవస్థ వల్లే జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నిక కాగలుగుతున్నారు. మండల వ్యవస్థలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆ మండల స్థాయి అభివృద్ధి కోసం చర్చించుకుంటారు. మండలాల్లో జిల్లా పరిషత్ పనులు, నిధులకు సంబంధించి చర్చించేందుకు కచ్చితంగా మండలం నుంచి ఎన్నికయ్యే జెడ్పీటీసీ సభ్యుడు ఉన్నప్పుడే వాటికి సరైన న్యాయం జరుగుతుంది.
– అధికారి జయవెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, అమలాపురం రూరల్
పరిషత్తుల్లో ప్రాతినిధ్యం తొలగించేందుకే..
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేదిగా ఉంది. ఐదంచెల పరిపాలనతో గ్రామాభివృద్ధే ఆశయంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తే పాలన స్థంభిస్తుంది. గ్రామాల నుంచి మండల, జిల్లా పరిషత్‌లలో ప్రాతినిధ్యం తొలగించేందుకే ఈ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం పూనుకుంటోంది.
– పల్లేటి నీరజ, ఎంపీపీ, తుని
Advertisement
Advertisement