విశ్వమానవుడు కాళోజీ
Published Wed, Sep 11 2013 5:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
హన్మకొండ, న్యూస్‌లైన్ : కాళోజీ విశ్వమానవుడు.. ప్రజాస్వామికవాది.. గొప్ప మానవతావాది అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత గోవా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు శత జయంత్యుత్సవాలు వరంగల్ జిల్లా హన్మకొండలో సోమవారం ప్రారంభమయ్యూయి.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళోజీ విభిన్నమైన వ్యక్తి అని, బతుకు గురించి, బతుకు సమరం గురించి చెప్పేవారని, సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్‌నారాయణతో పోల్చదగినవానని అన్నారు. విప్లవ కవి, రచయిత వరవరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ నుంచి బతుకు సిద్ధాంతాన్ని కాళోజీ అలవర్చుకున్నారని, ఆయన సాహిత్యంలో ఆదే కన్పిస్తుందన్నారు. పిరికితనం, హింస రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే హింసనే ఎంచుకుంటానని ఆయన అనేవారని వరవరరావు చెప్పారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ కాళోజీ మొహమాటం లేకుండా మాట్లాడేవారన్నారు. ఆంధ్ర దోపిడీదారులను ద్వేషించారేగానీ, అక్కడి సామాన్య ప్రజలను ఏనాడూ ద్వేషించలేదన్నారు. సమావేశంలో మహిళా ఉద్యమకర్త వసంత కన్నాభిరాన్., అంపశయ్య నవీన్, దర్శకుడు బి.నర్సింగరావు, వీఆర్.విద్యార్థి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి ప్రసంగించారు. అనంతరం కాళోజీ జీవితంపై ‘పాలపిట్ట’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ వైద్యుడు, మానవతావాది డా.రామలక్షణమూర్తికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా కాళోజీ పురస్కారం అందజేశారు. ఉత్సవాల సమన్వయకర్త జీవన్‌కుమార్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్, విమలక్క, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement