జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ధర్మానికి, న్యాయానికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని జస్టిస్ పమిడిఘంటం కోదండ రామయ్య ఎన్నడూ విస్మరించలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వాటి మధ్య ఉన్న సన్నటి గీతను దృష్టిలో పెట్టుకుని ఆ రెండింటినీ సమన్వయం చేశాక ధర్మం వైపు మొగ్గిన న్యాయమూర్తుల్లోని అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడు ఆయన అని కొనియాడారు. న్యాయవ్యవస్థలో జీవితాంతం క్రమశిక్షణతో మెలగిన జస్టిస్ కోదండరామయ్య న్యాయవాదులందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచి పోతారని అభిప్రాయపడ్డారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరేళ్లు న్యాయమూర్తిగా చేశారని, సత్ప్రవర్తన, సమయ పాలనకు ఆయన మారు పేరని పేర్కొన్నారు. ‘న్యాయ ప్రక్రియలో విశిష్ట స్థానాన్ని ఏర్పర్చుకున్న అతి కొద్దిమంది న్యాయవాదుల్లో జస్టిస్ కోదండరామయ్య ఒకరు. మహాత్మా గాంధీజీ శ్రీరాముడిని ఎలా ఆదర్శంగా తీసుకున్నారో అలాగే జస్టిస్ కోదండరామయ్య కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుని నిరంతరం సత్యాన్వేషణ చేసిన మహామనీషి. తనకున్న పరిమితి వనరులు తన కోసమే కాకుండా విశాల సమాజ హితానికి పంచిన మహానుభావుడు. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సత్ప్రవర్తననే తన వారసులకు పంచి తన జీవన యానం సాగించారు. అలాగే జీవితాన్ని ముగించారు.
రామాయణంలో ఉన్న అనేక విలువలను సమాజంలో ఉన్న పరిస్థితులకు అన్వయించి సమాజం కోసం పాటుపడ్డ అతి కొద్దిమంది న్యాయమూర్తుల్లో ఆయన ముందు వరసలో ఉన్నారు’ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో న్యాయ నిర్ణేతలు ముందుకు నడిస్తే సమాజానికి ఎంతో సేవ చేసినవారవుతారని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు పి.శ్రీరఘురాం, పి.ఎస్.నర్సింహం తమ తండ్రి చూపిన మార్గంలో విధులు నిర్వర్తిస్తున్న తీరు సంతోషకరమని చెప్పారు. నీతి, నిజాయితీలు సత్ప్రవర్తన మూర్తీభవించిన మహనీయుడు మన మధ్య నుంచి వెళ్లిపోయినా ఆయన వేసిన ఆదర్శనీయ బాట మిగిలే ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment