రెండో జాబితాతో ‘విద్యుత్’ ఏఈల భర్తీ!
ఏఈ పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలతో ట్రాన్స్‌కో, డిస్కంలలో మిగిలిన పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు చేరకపోవడంతో ఖాళీగా మిగిలిన 239 విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెండో జాబితాను ప్రకటించి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశిస్తూ గత జూలై 1న రాష్ట్ర ఇంధన శాఖ జారీ చేసిన సర్క్యులర్ చెల్లుబాటు కాదని ఇటీవల రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రెండో జాబితాతో మిగులు పోస్టులను భర్తీ చేస్తే అవకతవకలు జరిగే అవకాశముందని నిరుద్యోగ అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.
మిగులు పోస్టులను ఉమ్మడి నియామక ప్రకటనతో భర్తీ చేయాలని కోరుతున్నారు. జెన్‌కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్‌లో 164, ఎస్పీడీసీఎల్‌లో 201 ఏఈ పోస్టులు కలిపి మొత్తం 1,427 పోస్టుల భర్తీకి గతేడాది ఆయా విద్యుత్ సంస్థలు వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేశాయి. ప్రతిభ గల పలువురు అభ్యర్థులు రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారు ఏదో ఒక సంస్థలో చేరగా, వేరే సంస్థల్లో వీరికి సంబంధిం చిన పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ప్రధా నంగా టీఎస్‌ఎన్పీడీసీఎల్ 164 ఏఈ పోస్టులకు గాను 107 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ సంస్థలో నియామకాలు ఆలస్యం కావడంతో మెరిట్ అభ్యర్థులు ఇతర సంస్థల్లో చేరిపోయారు.
ట్రాన్స్‌కోలో 206 పోస్టులకుగాను 59, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 201 పోస్టులకుగాను 73 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. జెన్‌కోలో సైతం కొన్ని పోస్టులు మిగిలినా ఇప్పట్లో సంస్థకు కొత్త ఉద్యోగులు అవసరం లేదని ప్రభుత్వం విరమించుకుంది. ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో మిగిలిపోయిన 239 పోస్టులను రెండో జాబితాతో భర్తీ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 107 పోస్టులు ఖాళీగా మిగలడంతో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎంపీతోపాటు పలువురు నేతలు రెండో జాబితా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రెండో జాబితాతో భర్తీకి అనుమతిస్తూ ఇంధన శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఇంధన శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
మెరిట్ ప్రకారం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆ జాబితాలోని అభ్యర్థులు ఉద్యోగంలో చేరక ఖాళీగా మిగిలిపోయే పోస్టులను మళ్లీ కొత్త నియామక ప్రకటన ద్వారానే భర్తీ చేయాలని 1997 ఫిబ్రవరి 22న జారీ చేసిన జీవో నం.81 స్పష్టం చేస్తోంది.