Sudershan Reddy
-
తిట్లతో తెలంగాణకు అప్రతిష్ట
సాక్షి, హైదరాబాద్: ‘మనిషి ఔన్నత్యం, ప్రతిష్టను పెంపొందించేందుకు రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పొందుపరిచారు. తెలంగాణ సమాజంలో ఉండే ప్రతి పౌరుడి ప్రతిష్ట, వ్యక్తిగత ఔన్నత్యాన్ని విఘాతం కలిగించే రీతిలో రాజకీయ పార్టీల మధ్య బూతు పురాణాల పోటీ జరుగుతోంది. యావత్ తెలంగాణ సమాజం ప్రతిష్ట మసక బారిపోతోంది’అని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దేశవిదేశాల్లో సెమినార్లు ఇస్తుంటాను.. మీ దగ్గర ఇట్ల మాట్లాడుకుంటారా? మీకు మరో భాష రాదా? అని ప్రశ్నిస్తున్నరు. బూతులు చూసినోడు.. విన్నోడు.. చదివినోడు మీ దగ్గర బూతులు తప్ప మరేంలేవా? అని అడుగుతున్నడు’అని పేర్కొన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జేఏసీ నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. అధికార, విపక్ష పార్టీల మధ్య జరుగుతున్న దూషణల పర్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని, శత్రువుల మధ్య యుద్ధం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా భావించినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కూడా చేయలేని పరిస్థితి.. ‘ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, సత్యాగ్రహాలు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంటే పౌరుడేం చేయాలి? గత 50 ఏళ్లుగా వివిధ దేశాల రాజ్యాంగాలను, చారిత్రక నేపథ్యాలను చదువుతూ విశ్లేషించడం నాకు అలవాటు. ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి విసిగిస్తున్నారని అసెంబ్లీని రద్దు చేసుకోవడం నేనెప్పుడూ చరిత్రలో వినలేదు కనలేదు. కోర్టులంటే రాజ్యాంగబద్ధ సంస్థలు.ప్రజలకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వెళ్లి న్యాయం కోరడం తప్పా? కోర్టులు అంటరానివా.. న్యాయప్రక్రియ పట్ల మీకు న్న అభిప్రాయాన్ని సూటిగా చెప్పండి’ అని అధికార పక్షాన్ని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి నిలదీశారు. ‘ఆయన భూమిని లాక్కుంటారు. ఈమె (లాయర్ రచనారెడ్డి వైపు చూపుతూ) కోర్టుకు వెళ్తది. నేరమా? క్రమ శిక్షణ ఉల్లంఘనా? ఆ రాసిన రాతలో తిట్ల పురాణం లేదన్నదే నీ అభ్యంతరమా’ అని పేర్కొన్నారు. కులతత్వం ఇంకెంత కాలం? ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో జేఏసీ చైర్మన్ రఘుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్న. తెలంగాణ మంచి కోరుకునే వాడినే. తెలంగాణ అభివృద్ధి చెందితే చాలా సంతోషపడేవాడినే. ఇక్కడికి రావడం సాహసం అని గుజ్జల భిక్షం అన్నారు. అంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తుంది’అని స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ‘2018లో కూడా అప్రజాస్వామికం, అవినీతి, కులవ్యవస్థను పెంచి ప్రోత్సహించడమేంటి? దేశంలో తొలి ప్రాధాన్యం విద్యకు ఉండాలి. విద్యకు ఈ రోజు కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. పెద్ద మొత్తంలో డబ్బుతో కూడిన విషయాల్లో (కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి) ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనిపిస్తోంది’ అని మురళీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మ న్ రఘు, ఆంధ్రజ్యోతి, వీక్షణం పత్రికల ఎడిటర్లు కె.శ్రీనివాస్, ఎన్.వేణుగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. -
జస్టిస్ కోదండరామయ్య స్ఫూర్తిప్రదాత
సాక్షి, హైదరాబాద్: ధర్మానికి, న్యాయానికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని జస్టిస్ పమిడిఘంటం కోదండ రామయ్య ఎన్నడూ విస్మరించలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వాటి మధ్య ఉన్న సన్నటి గీతను దృష్టిలో పెట్టుకుని ఆ రెండింటినీ సమన్వయం చేశాక ధర్మం వైపు మొగ్గిన న్యాయమూర్తుల్లోని అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడు ఆయన అని కొనియాడారు. న్యాయవ్యవస్థలో జీవితాంతం క్రమశిక్షణతో మెలగిన జస్టిస్ కోదండరామయ్య న్యాయవాదులందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచి పోతారని అభిప్రాయపడ్డారు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరేళ్లు న్యాయమూర్తిగా చేశారని, సత్ప్రవర్తన, సమయ పాలనకు ఆయన మారు పేరని పేర్కొన్నారు. ‘న్యాయ ప్రక్రియలో విశిష్ట స్థానాన్ని ఏర్పర్చుకున్న అతి కొద్దిమంది న్యాయవాదుల్లో జస్టిస్ కోదండరామయ్య ఒకరు. మహాత్మా గాంధీజీ శ్రీరాముడిని ఎలా ఆదర్శంగా తీసుకున్నారో అలాగే జస్టిస్ కోదండరామయ్య కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుని నిరంతరం సత్యాన్వేషణ చేసిన మహామనీషి. తనకున్న పరిమితి వనరులు తన కోసమే కాకుండా విశాల సమాజ హితానికి పంచిన మహానుభావుడు. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సత్ప్రవర్తననే తన వారసులకు పంచి తన జీవన యానం సాగించారు. అలాగే జీవితాన్ని ముగించారు. రామాయణంలో ఉన్న అనేక విలువలను సమాజంలో ఉన్న పరిస్థితులకు అన్వయించి సమాజం కోసం పాటుపడ్డ అతి కొద్దిమంది న్యాయమూర్తుల్లో ఆయన ముందు వరసలో ఉన్నారు’ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో న్యాయ నిర్ణేతలు ముందుకు నడిస్తే సమాజానికి ఎంతో సేవ చేసినవారవుతారని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు పి.శ్రీరఘురాం, పి.ఎస్.నర్సింహం తమ తండ్రి చూపిన మార్గంలో విధులు నిర్వర్తిస్తున్న తీరు సంతోషకరమని చెప్పారు. నీతి, నిజాయితీలు సత్ప్రవర్తన మూర్తీభవించిన మహనీయుడు మన మధ్య నుంచి వెళ్లిపోయినా ఆయన వేసిన ఆదర్శనీయ బాట మిగిలే ఉందని పేర్కొన్నారు. -
సమాంతర కాలువకు ‘సుదర్శన ’ చక్రం అడ్డు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నో అవాంతరాల తర్వాత తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతర కాలువ ప్రతిపాదనపై కర్ణాటక సర్కారు సానుకూలంగా స్పందిస్తుంటే.. మన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి మాత్రం మోకాలడ్డే యత్నం చేస్తున్నారు. సమావేశానికి మంత్రి గైర్హాజరు కావాలని నిర్ణయించిన నేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం నిర్వహించనున్న సమావేశ లక్ష్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నదిపై కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హొస్పేట వద్ద 133 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. దీని నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే.. హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వి, టీబీ డ్యామ్‌కు వరద వచ్చే సమయంలో వైఎస్సార్ జిల్లాలోని పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్, మైలవరం రిజర్వాయర్లను నింపుకుని, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చునని నీటి పారుదల రంగ నిపుణులు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనను కర్ణాటక, ప్రధానంగా బళ్లారి జిల్లా రైతులు ససేమిరా అంటూ వచ్చారు. కానీ.. ఇటీవల బళ్లారి రైతుల్లో మార్పు వచ్చింది. సమాంతర కాలువ వల్ల తమకు కూడా ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే సమాంతర కాలువపై పలుమార్లు కర్ణాటకు విజ్ఞప్తి చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. సర్వే చేయించి సమాంతర కాలువ వల్ల ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని తేల్చారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందంతో శుక్రవారం(తొలుత గురువారం అనుకుని.. వాయిదా వేశారు) బెంగళూరులో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని కర్ణాటక సర్కారు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణకు నీటిని తెచ్చే ఆర్డీఎస్కు అన్యాయం జరుగుతుందనే సాకు చూపి బెంగళూరు సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శనరెడ్డి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీంతో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు. అయితే.. సమాంతర కాలువ తవ్వకం వల్ల ఆర్డీఎస్కు ఎలాంటి అన్యాయం జరగదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్త్తున్నారు. -
విశ్వమానవుడు కాళోజీ
హన్మకొండ, న్యూస్‌లైన్ : కాళోజీ విశ్వమానవుడు.. ప్రజాస్వామికవాది.. గొప్ప మానవతావాది అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత గోవా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు శత జయంత్యుత్సవాలు వరంగల్ జిల్లా హన్మకొండలో సోమవారం ప్రారంభమయ్యూయి. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళోజీ విభిన్నమైన వ్యక్తి అని, బతుకు గురించి, బతుకు సమరం గురించి చెప్పేవారని, సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్‌నారాయణతో పోల్చదగినవానని అన్నారు. విప్లవ కవి, రచయిత వరవరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ నుంచి బతుకు సిద్ధాంతాన్ని కాళోజీ అలవర్చుకున్నారని, ఆయన సాహిత్యంలో ఆదే కన్పిస్తుందన్నారు. పిరికితనం, హింస రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే హింసనే ఎంచుకుంటానని ఆయన అనేవారని వరవరరావు చెప్పారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ కాళోజీ మొహమాటం లేకుండా మాట్లాడేవారన్నారు. ఆంధ్ర దోపిడీదారులను ద్వేషించారేగానీ, అక్కడి సామాన్య ప్రజలను ఏనాడూ ద్వేషించలేదన్నారు. సమావేశంలో మహిళా ఉద్యమకర్త వసంత కన్నాభిరాన్., అంపశయ్య నవీన్, దర్శకుడు బి.నర్సింగరావు, వీఆర్.విద్యార్థి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి ప్రసంగించారు. అనంతరం కాళోజీ జీవితంపై ‘పాలపిట్ట’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ వైద్యుడు, మానవతావాది డా.రామలక్షణమూర్తికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా కాళోజీ పురస్కారం అందజేశారు. ఉత్సవాల సమన్వయకర్త జీవన్‌కుమార్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్, విమలక్క, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.