సాక్షి, హైదరాబాద్: ‘మనిషి ఔన్నత్యం, ప్రతిష్టను పెంపొందించేందుకు రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పొందుపరిచారు. తెలంగాణ సమాజంలో ఉండే ప్రతి పౌరుడి ప్రతిష్ట, వ్యక్తిగత ఔన్నత్యాన్ని విఘాతం కలిగించే రీతిలో రాజకీయ పార్టీల మధ్య బూతు పురాణాల పోటీ జరుగుతోంది. యావత్ తెలంగాణ సమాజం ప్రతిష్ట మసక బారిపోతోంది’అని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దేశవిదేశాల్లో సెమినార్లు ఇస్తుంటాను.. మీ దగ్గర ఇట్ల మాట్లాడుకుంటారా? మీకు మరో భాష రాదా? అని ప్రశ్నిస్తున్నరు. బూతులు చూసినోడు.. విన్నోడు.. చదివినోడు మీ దగ్గర బూతులు తప్ప మరేంలేవా? అని అడుగుతున్నడు’అని పేర్కొన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జేఏసీ నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. అధికార, విపక్ష పార్టీల మధ్య జరుగుతున్న దూషణల పర్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని, శత్రువుల మధ్య యుద్ధం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా భావించినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ధర్నా కూడా చేయలేని పరిస్థితి..
‘ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, సత్యాగ్రహాలు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంటే పౌరుడేం చేయాలి? గత 50 ఏళ్లుగా వివిధ దేశాల రాజ్యాంగాలను, చారిత్రక నేపథ్యాలను చదువుతూ విశ్లేషించడం నాకు అలవాటు. ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి విసిగిస్తున్నారని అసెంబ్లీని రద్దు చేసుకోవడం నేనెప్పుడూ చరిత్రలో వినలేదు కనలేదు. కోర్టులంటే రాజ్యాంగబద్ధ సంస్థలు.ప్రజలకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వెళ్లి న్యాయం కోరడం తప్పా? కోర్టులు అంటరానివా.. న్యాయప్రక్రియ పట్ల మీకు న్న అభిప్రాయాన్ని సూటిగా చెప్పండి’ అని అధికార పక్షాన్ని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి నిలదీశారు. ‘ఆయన భూమిని లాక్కుంటారు. ఈమె (లాయర్ రచనారెడ్డి వైపు చూపుతూ) కోర్టుకు వెళ్తది. నేరమా? క్రమ శిక్షణ ఉల్లంఘనా? ఆ రాసిన రాతలో తిట్ల పురాణం లేదన్నదే నీ అభ్యంతరమా’ అని పేర్కొన్నారు.
కులతత్వం ఇంకెంత కాలం?
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో జేఏసీ చైర్మన్ రఘుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్న. తెలంగాణ మంచి కోరుకునే వాడినే. తెలంగాణ అభివృద్ధి చెందితే చాలా సంతోషపడేవాడినే. ఇక్కడికి రావడం సాహసం అని గుజ్జల భిక్షం అన్నారు. అంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తుంది’అని స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ‘2018లో కూడా అప్రజాస్వామికం, అవినీతి, కులవ్యవస్థను పెంచి ప్రోత్సహించడమేంటి? దేశంలో తొలి ప్రాధాన్యం విద్యకు ఉండాలి. విద్యకు ఈ రోజు కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. పెద్ద మొత్తంలో డబ్బుతో కూడిన విషయాల్లో (కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి) ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనిపిస్తోంది’ అని మురళీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మ న్ రఘు, ఆంధ్రజ్యోతి, వీక్షణం పత్రికల ఎడిటర్లు కె.శ్రీనివాస్, ఎన్.వేణుగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.
Published Wed, Oct 10 2018 2:17 AM | Last Updated on Wed, Oct 10 2018 2:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment