vulgar language
-
తిట్లతో తెలంగాణకు అప్రతిష్ట
సాక్షి, హైదరాబాద్: ‘మనిషి ఔన్నత్యం, ప్రతిష్టను పెంపొందించేందుకు రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పొందుపరిచారు. తెలంగాణ సమాజంలో ఉండే ప్రతి పౌరుడి ప్రతిష్ట, వ్యక్తిగత ఔన్నత్యాన్ని విఘాతం కలిగించే రీతిలో రాజకీయ పార్టీల మధ్య బూతు పురాణాల పోటీ జరుగుతోంది. యావత్ తెలంగాణ సమాజం ప్రతిష్ట మసక బారిపోతోంది’అని సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దేశవిదేశాల్లో సెమినార్లు ఇస్తుంటాను.. మీ దగ్గర ఇట్ల మాట్లాడుకుంటారా? మీకు మరో భాష రాదా? అని ప్రశ్నిస్తున్నరు. బూతులు చూసినోడు.. విన్నోడు.. చదివినోడు మీ దగ్గర బూతులు తప్ప మరేంలేవా? అని అడుగుతున్నడు’అని పేర్కొన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జేఏసీ నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. అధికార, విపక్ష పార్టీల మధ్య జరుగుతున్న దూషణల పర్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని, శత్రువుల మధ్య యుద్ధం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా భావించినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కూడా చేయలేని పరిస్థితి.. ‘ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, సత్యాగ్రహాలు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంటే పౌరుడేం చేయాలి? గత 50 ఏళ్లుగా వివిధ దేశాల రాజ్యాంగాలను, చారిత్రక నేపథ్యాలను చదువుతూ విశ్లేషించడం నాకు అలవాటు. ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లి విసిగిస్తున్నారని అసెంబ్లీని రద్దు చేసుకోవడం నేనెప్పుడూ చరిత్రలో వినలేదు కనలేదు. కోర్టులంటే రాజ్యాంగబద్ధ సంస్థలు.ప్రజలకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వెళ్లి న్యాయం కోరడం తప్పా? కోర్టులు అంటరానివా.. న్యాయప్రక్రియ పట్ల మీకు న్న అభిప్రాయాన్ని సూటిగా చెప్పండి’ అని అధికార పక్షాన్ని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి నిలదీశారు. ‘ఆయన భూమిని లాక్కుంటారు. ఈమె (లాయర్ రచనారెడ్డి వైపు చూపుతూ) కోర్టుకు వెళ్తది. నేరమా? క్రమ శిక్షణ ఉల్లంఘనా? ఆ రాసిన రాతలో తిట్ల పురాణం లేదన్నదే నీ అభ్యంతరమా’ అని పేర్కొన్నారు. కులతత్వం ఇంకెంత కాలం? ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో జేఏసీ చైర్మన్ రఘుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్న. తెలంగాణ మంచి కోరుకునే వాడినే. తెలంగాణ అభివృద్ధి చెందితే చాలా సంతోషపడేవాడినే. ఇక్కడికి రావడం సాహసం అని గుజ్జల భిక్షం అన్నారు. అంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తుంది’అని స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ‘2018లో కూడా అప్రజాస్వామికం, అవినీతి, కులవ్యవస్థను పెంచి ప్రోత్సహించడమేంటి? దేశంలో తొలి ప్రాధాన్యం విద్యకు ఉండాలి. విద్యకు ఈ రోజు కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. పెద్ద మొత్తంలో డబ్బుతో కూడిన విషయాల్లో (కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి) ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనిపిస్తోంది’ అని మురళీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మ న్ రఘు, ఆంధ్రజ్యోతి, వీక్షణం పత్రికల ఎడిటర్లు కె.శ్రీనివాస్, ఎన్.వేణుగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. ఇవేమి పోలింగ్ ‘బూతు’లు!
గత వారం, పది రోజులుగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో రాష్ట్ర రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులపై సాగిస్తున్న దూషణలపర్వమిది. సభ్యత మరచి నేతలు చదువుతున్న బూతుల దండకమిది. నువ్వు ఒకటంటే నేను రెండంటా... నువ్వు రెండంటే నేను నాలుగంటా అన్నట్లు ‘వాక్పటిమ’కు పెడుతున్న పదును ఇది. సామాన్యుల దృష్టిని సులువుగా ఆకర్షించేందుకు ఎంచుకున్న చవకబారు పద్ధతిది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి దూషణలు ఇంకా ఎలా ఉంటాయోనని పరిశీలకుల కలవరం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రగిలించిన వేడి మరింత తీవ్రమవుతోంది. నేతల మాటల దాడి రోజురోజుకూ ముదురుతోంది. రాజకీయ ప్రముఖుల అసభ్యకర దూషణలు విని సాధారణ ప్రజానీకం అవాక్కవుతోంది. టీవీల్లో నేతల ఎన్నికల ప్రసంగాలు వినాలంటేనే జంకుతోంది. ఇవేం ‘మాటలు’బాబోయ్ అంటూ ప్రజలు నోరెళ్లబెడుతుంటే ఇలాంటి రాజకీయాలు తామెప్పుడూ చూడలేదంటూ 1970 దశకానికి చెందిన రాజకీయ నేతలు విస్తుపోతున్నారు. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే నేతల మాటలు సెన్సార్ చేసే పరిస్థితి వస్తే నామినేషన్ల దశకు వచ్చేసరికి మరెంత ఘాటుగా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు కలవరపడుతున్నారు. అలవోకగా దూషణలు... ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ పదాలు వాడొచ్చా... ఒకవేళ వాడితే జనం తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని ఒకప్పటి నేతలు ఆలోచించే వారు. ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను కుక్కమూతి పిందెలు అనడమే 1980 దశకంలో సంచలనం సృష్టించగా 1990 దశకం మధ్యకు వచ్చేసరికి రాజకీయ నాయకులు, వారి వ్యక్తిగత విషయాల్లోకి చొరబడటం దాకా జరిగిపోయాయి. ప్రస్తుత రాజకీయ నాయకులు మరింతగా నోటికి పనిచెబుతున్నారు. బట్టేబాజ్, బుడ్డర్ఖాన్, కొడుకులు, ఒళ్లు దగ్గర పెట్టుకో, బతుకు చెడ, లంగ, లఫంగ, లుచ్చా ఇవి గడచిన వారం రోజులుగా తెలంగాణ ఎన్నికల రాజకీయ చిత్రపటంలో వినిపించిన పదాలు. దొంగలు, గజదొంగలు అన్నవి అత్యంత సాధారణమైన తిట్లు అయిపోయాయి. ‘మీ బతుకు చెడ చంద్రబాబుతో పొత్తా’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నల్లగొండలో అంటే, టీడీపీతో పొత్తు కోసం 2009లో ఎవరి కాళ్లు పట్టుకున్నారు కొడుకుల్లారా అంటూ గద్వాల సభలో మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వనపర్తి బహిరంగ సభలో ‘అరుణ నీ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరిస్తే... కేంద్ర మంత్రిగా ఉండి పాలమూరు అభివృద్ధికి ఏం పీకావంటూ కేసీఆర్‌పై డీకే అరుణ దూషణలపర్వం కొనసాగించారు. కాంగ్రెసోళ్లను లంగలు, లుచ్ఛాలు, లఫంగాలు అంటూ మంత్రి కేటీఆర్ దూషించగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న మాటలనే పదేపదే అంటూ రేవంత్‌రెడ్డి ప్రతి సభలోనూ తిట్ల దండకం అందుకుంటున్నారు. నామినేషన్ల దశకు వస్తే ఎలా ఉంటుందో... నోటిఫికేషన్‌కు నెల రోజుల సమయం ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే నామినేషన్ల సమయం వచ్చేసరికి ఎలా ఉంటుందోనన్న ఆందోళన రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల్లో ఉంది. ఒక పార్టీ లేదా నాయకుడు పొరపాటున నోరుజారితే ప్రత్యర్థి పార్టీ దాన్ని ఎత్తిచూపి హుందాగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉండదని వారంటున్నారు. అవతలి పార్టీ లేదా నేత ఒకటంటే తాను రెండంటానన్న ధోరణి కనిపిస్తోందని, ఇది రాజకీయాలపట్ల యువతకు ఏహ్యభావం కలగడానికి దారితీస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు భాష విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలంటున్నారు. ఈ అంశంపై పార్టీల నేతలతో ఓ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. చేసింది, చేయబోయే విషయాలు చెప్పరేం? ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామన్నది అధికార పార్టీ చెబుతుంది. అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో అన్నది ప్రతిపక్ష పార్టీ వివరిస్తుంది. 1980 దశకం ఆఖరు దాకా ఉమ్మడి ఏపీలోనూ రాజకీయాలు ఇలాగే సాగాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసే బదులు అధికార పార్టీ నేతలు ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. విపక్ష నేతలూ అదే బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెసోళ్లకు... సీఎం, ఆయన కుటుంబం లక్ష్యమైతే... కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్ మాటల దాడి వ్యూహాన్ని ఎంచుకుంది. రాజకీయ పార్టీల సభల్లో నేతల ప్రసంగాలు వచ్చేటప్పుడు చానల్ మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దూషణల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి.– వృత్తి నిపుణులు సరైన సమయంలోనే వైదొలిగా... నెహ్రూ, ఆచార్య ఎన్. జి. రంగా వంటి నేతలను చూసి ప్రభావితమై నేను 1970 దశకంలో రాజకీయాల్లో ప్రవేశించా. అప్పట్లో పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండేవిగానీ వ్యక్తిగత దూషణలకు ఏమాత్రం చోటు ఉండేది కాదు. నియోజకవర్గ స్థాయిలోనూ దూషణలు అస్సలు ఉండేవి కావు. ఇప్పుడు తిట్లు వింటుంటే సరైన సమయంలో రాజకీయాల నుంచి వైదొలిగామన్న తృప్తి ఉంది. ఏదేమైనా రోజురోజుకు రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నాయి. – కొణిజేటి రోశయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నోటి దురుసుతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక తగాదాలు వస్తుంటాయి. బుడ్డర్ఖాన్ అన్న పదం ఉపయోగించినందుకు 1990 దశకం మధ్యలో నెల్లూరు జిల్లాలో ఓ హత్య కూడా జరిగింది. నీ బతుకు చెడ అన్న పదం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా తప్పు. ఎవరైనా ఆ పదం ఉపయోగించారంటే అప్పటికే ఇద్దరు వ్యక్తుల సమూహాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నప్పుడే జరుగుతుంది. దాని మీదే కేసులు పెట్టుకోవడం, జైలుకెళ్లడం దాకా ఘటనలు ఎన్నో చూశా. – ఓ మాజీ డీజీపీ రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా వారే సాధారణ ప్రజానీకం మాదిరి తిట్లదండకం అందుకుంటే ఓహో తిట్లు తప్పు కాదులే అని సామాన్యులు పొరబడే ప్రమాదం ఉంది. –ఓ యువ ఐఏఎస్ అధికారి. మామూలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య ఆయన కూడా స్థాయిని మరచి దూషణలకు దిగుతున్నారు. ఎందుకో కొంత బాధ అనిపించింది. – ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు. -
ఆ భాషేంటి.. పార్థా..
♦ ‘ఈ... కొడుకులను చెప్పుతో కొట్టి అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి. వీళ్లను వదలొద్దు. తమాషా చేస్తారా? వాళ్ల సంగతి చూడు.’ ♦ ఈ నెల 8న పెనుకొండలో ధర్నా చేస్తున్న విపక్షనేతపై బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ♦ ‘... నా కొడకా, అవతారం చేస్తావా? ...మూసుకుని ఉండవోయి. ఈ నా కొడుకును తీసుకెళ్లి కేసులు పెట్టండి. అప్పుడు తెలుస్తాది.’ ♦ ఇంటింటికీ టీడీపీలో బ్రహ్మసముద్రంలో సొంత పార్టీ కార్యకర్తపై పార్థుడి దురుసు ♦ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి విచక్షణ మరిచి రెచ్చిపోతున్న వైనమిది. ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్న తీరిదీ. నరం లేని నాలుక పలుకుతున్న బూతు పురాణమిది. అడ్డూఅదుపు లేకుండా.. రాయలేని భాషను ఉపయోగిస్తున్న తీరు ప్రజల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం:ఆ ఎంపీ.. ఈ ఎమ్మెల్యే అంతే. నోటికి ఏది వస్తే అది.. ఏది తోస్తే అది అనేయడమే. ఇప్పటి వరకు టీడీపీలో ఆ ఇద్దరికే పరిమితమైన నోటి దురుసును మరో ఎమ్మెల్యే అందిపుచ్చుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి వ్యవహారం అందరినీ కలవరపరుస్తోంది. ఓటమి భయమో.. పార్టీ తీరుతోనే ఆయన ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. బూతులు తిట్టడం.. కేసులు నమోదు చేయండని పోలీసులను పురమాయించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుందనే చర్చకు తావిస్తోంది. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పార్థసారథి సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రంలో పర్యటించారు. అప్పుడు జగన్ అనే టీడీపీ కార్యకర్త గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో రోడ్లు, మంచినీళ్లు తదితర కనీస సౌకర్యాలు కూడా లేవని.. ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రావడం, వెళ్లిపోవడం మినహా సమస్యలను పట్టించుకోవట్లేదని వాపోయాడు. ఓట్లేసి గెలిపించిన ఓటరుగా ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ఇందుకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే పార్థు తీవ్ర పదజాలంతో దూషించిన తీరు అక్కడి ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. కేసులు పెట్టండని పోలీసులను పురమాయించడంతో భయాందోళనకు లోనైన ఆ వ్యక్తి పది రోజులకు పైగా గ్రామం విడిచి వెళ్లి హిందూపురంలో తలదాచుకోవడం గమనార్హం. బంద్ సమయంలోనూ బూతులు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈనెల 8న సీపీఐ, సీపీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో వామపక్ష పార్టీల నేతలు పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి కారులో అటుగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిల్చున్నారు. అక్కడ కారుకు అడ్డంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలు నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళంవిప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిని బూతులు తిడుతూ నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. బ్రహ్మసముద్రం, పెనుకొండలోనే కాదు చాలా సందర్భాల్లో పార్థసారథి ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడారు. దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు పెనుకొండలో పార్థసారథి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. -
ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినుల ధర్నా
చిత్తూరు : అసభ్య పదజాలంతో దూషిస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినులు రోడ్డెక్కిన సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్తకోటలోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ చంద్రకుమార్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా అసభ్యంగా మాట్లాడుతున్నాడని మనస్థాపం చెందిన విద్యార్థినులు ఎమ్ఈవోకు వినతిపత్రం అందించారు. అనంతరం వెంటనే ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్సీ భవనం ఎదుట ధర్నాకు దిగారు.