వామ్మో.. ఇవేమి పోలింగ్‌ ‘బూతు’లు! | Political Leaders Vulgar Language In Telangana Election Campaign | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 1:46 AM | Last Updated on Tue, Oct 9 2018 8:26 AM

Political Leaders Vulgar Language In Telangana Election Campaign - Sakshi

గత వారం, పది రోజులుగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో రాష్ట్ర రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులపై సాగిస్తున్న దూషణలపర్వమిది. సభ్యత మరచి నేతలు చదువుతున్న బూతుల దండకమిది. నువ్వు ఒకటంటే నేను రెండంటా... నువ్వు రెండంటే నేను నాలుగంటా అన్నట్లు ‘వాక్పటిమ’కు పెడుతున్న పదును ఇది. సామాన్యుల దృష్టిని సులువుగా ఆకర్షించేందుకు ఎంచుకున్న చవకబారు పద్ధతిది.  
ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి దూషణలు ఇంకా ఎలా ఉంటాయోనని పరిశీలకుల కలవరం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రగిలించిన వేడి మరింత తీవ్రమవుతోంది. నేతల మాటల దాడి రోజురోజుకూ ముదురుతోంది. రాజకీయ ప్రముఖుల అసభ్యకర దూషణలు విని సాధారణ ప్రజానీకం అవాక్కవుతోంది. టీవీల్లో నేతల ఎన్నికల ప్రసంగాలు వినాలంటేనే జంకుతోంది. ఇవేం ‘మాటలు’బాబోయ్‌ అంటూ ప్రజలు నోరెళ్లబెడుతుంటే ఇలాంటి రాజకీయాలు తామెప్పుడూ చూడలేదంటూ 1970 దశకానికి చెందిన రాజకీయ నేతలు విస్తుపోతున్నారు. శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ సమయంలోనే నేతల మాటలు సెన్సార్‌ చేసే పరిస్థితి వస్తే నామినేషన్ల దశకు వచ్చేసరికి మరెంత ఘాటుగా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు కలవరపడుతున్నారు. 

అలవోకగా దూషణలు... 
ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ పదాలు వాడొచ్చా... ఒకవేళ వాడితే జనం తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని ఒకప్పటి నేతలు ఆలోచించే వారు. ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలను కుక్కమూతి పిందెలు అనడమే 1980 దశకంలో సంచలనం సృష్టించగా 1990 దశకం మధ్యకు వచ్చేసరికి రాజకీయ నాయకులు, వారి వ్యక్తిగత విషయాల్లోకి చొరబడటం దాకా జరిగిపోయాయి. ప్రస్తుత రాజకీయ నాయకులు మరింతగా నోటికి పనిచెబుతున్నారు. బట్టేబాజ్, బుడ్డర్‌ఖాన్, కొడుకులు, ఒళ్లు దగ్గర పెట్టుకో, బతుకు చెడ, లంగ, లఫంగ, లుచ్చా ఇవి గడచిన వారం రోజులుగా తెలంగాణ ఎన్నికల రాజకీయ చిత్రపటంలో వినిపించిన పదాలు. దొంగలు, గజదొంగలు అన్నవి అత్యంత సాధారణమైన తిట్లు అయిపోయాయి. ‘మీ బతుకు చెడ చంద్రబాబుతో పొత్తా’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నల్లగొండలో అంటే, టీడీపీతో పొత్తు కోసం 2009లో ఎవరి కాళ్లు పట్టుకున్నారు కొడుకుల్లారా అంటూ గద్వాల సభలో మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ వనపర్తి బహిరంగ సభలో ‘అరుణ నీ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరిస్తే... కేంద్ర మంత్రిగా ఉండి పాలమూరు అభివృద్ధికి ఏం పీకావంటూ కేసీఆర్‌పై డీకే అరుణ దూషణలపర్వం కొనసాగించారు. కాంగ్రెసోళ్లను లంగలు, లుచ్ఛాలు, లఫంగాలు అంటూ మంత్రి కేటీఆర్‌ దూషించగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌ ఉపయోగిస్తున్న మాటలనే పదేపదే అంటూ రేవంత్‌రెడ్డి ప్రతి సభలోనూ తిట్ల దండకం అందుకుంటున్నారు.
 
నామినేషన్ల దశకు వస్తే ఎలా ఉంటుందో... 
నోటిఫికేషన్‌కు నెల రోజుల సమయం ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే నామినేషన్ల సమయం వచ్చేసరికి ఎలా ఉంటుందోనన్న ఆందోళన రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల్లో ఉంది. ఒక పార్టీ లేదా నాయకుడు పొరపాటున నోరుజారితే ప్రత్యర్థి పార్టీ దాన్ని ఎత్తిచూపి హుందాగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉండదని వారంటున్నారు. అవతలి పార్టీ లేదా నేత ఒకటంటే తాను రెండంటానన్న ధోరణి కనిపిస్తోందని, ఇది రాజకీయాలపట్ల యువతకు ఏహ్యభావం కలగడానికి దారితీస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు భాష విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలంటున్నారు. ఈ అంశంపై పార్టీల నేతలతో ఓ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.
 
చేసింది, చేయబోయే విషయాలు చెప్పరేం? 
ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామన్నది అధికార పార్టీ చెబుతుంది. అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో అన్నది ప్రతిపక్ష పార్టీ వివరిస్తుంది. 1980 దశకం ఆఖరు దాకా ఉమ్మడి ఏపీలోనూ రాజకీయాలు ఇలాగే సాగాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి  ప్రచారం చేసే బదులు అధికార పార్టీ నేతలు ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. విపక్ష నేతలూ అదే బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెసోళ్లకు... సీఎం, ఆయన కుటుంబం లక్ష్యమైతే... కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్‌ మాటల దాడి వ్యూహాన్ని ఎంచుకుంది. 

రాజకీయ పార్టీల సభల్లో నేతల ప్రసంగాలు వచ్చేటప్పుడు చానల్‌ మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దూషణల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి.– వృత్తి నిపుణులు 
  
సరైన సమయంలోనే వైదొలిగా... 
నెహ్రూ, ఆచార్య ఎన్‌. జి. రంగా వంటి నేతలను చూసి ప్రభావితమై నేను 1970 దశకంలో రాజకీయాల్లో ప్రవేశించా. అప్పట్లో పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండేవిగానీ వ్యక్తిగత దూషణలకు ఏమాత్రం చోటు ఉండేది కాదు. నియోజకవర్గ స్థాయిలోనూ దూషణలు అస్సలు ఉండేవి కావు. ఇప్పుడు తిట్లు వింటుంటే సరైన సమయంలో రాజకీయాల నుంచి వైదొలిగామన్న తృప్తి ఉంది. ఏదేమైనా రోజురోజుకు రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నాయి.  – కొణిజేటి రోశయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి 

నోటి దురుసుతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక తగాదాలు వస్తుంటాయి. బుడ్డర్‌ఖాన్‌ అన్న పదం ఉపయోగించినందుకు 1990 దశకం మధ్యలో నెల్లూరు జిల్లాలో ఓ హత్య కూడా జరిగింది. నీ బతుకు చెడ అన్న పదం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా తప్పు. ఎవరైనా ఆ పదం ఉపయోగించారంటే అప్పటికే ఇద్దరు వ్యక్తుల సమూహాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నప్పుడే జరుగుతుంది. దాని మీదే కేసులు పెట్టుకోవడం, జైలుకెళ్లడం దాకా ఘటనలు ఎన్నో చూశా. – ఓ మాజీ డీజీపీ 

రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా వారే సాధారణ ప్రజానీకం మాదిరి తిట్లదండకం అందుకుంటే ఓహో తిట్లు తప్పు కాదులే అని సామాన్యులు పొరబడే ప్రమాదం ఉంది. –ఓ యువ ఐఏఎస్‌ అధికారి. 

మామూలుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం వినాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య ఆయన కూడా స్థాయిని మరచి దూషణలకు దిగుతున్నారు. ఎందుకో కొంత బాధ అనిపించింది. – ఓ ఆర్థోపెడిక్‌ వైద్యుడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement