కొలిక్కివచ్చిన కంబిరిగాం భూ వివాదం | Kambirigam land issue | Sakshi
Sakshi News home page

కొలిక్కివచ్చిన కంబిరిగాం భూ వివాదం

Published Fri, Jul 24 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

Kambirigam land issue

 పలాస: కంబిరిగాం భూ సమస్య కొలిక్కివచ్చింది. 150 ఏళ్లుగా రైతులకు, కంబిరిగాం భూ స్వామి పరశురాం చౌదరి కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్న వివాదానికి హైకోర్టు చెక్ చెప్పింది. చౌదరి కుటుంబ సభ్యులు వేసిన స్టేను రద్దుచేస్తూ ఇనాం యాక్టు 10(ఎ) కింద రైతులకు రెండు భాగాలు, భూస్వామికి ఒక భాగం భూమిని కేటాయించి పట్టాలు మంజూరు చేయాలంటూ ఏప్రిల్ 28న తీర్పు వెలువరించింది. దీంతో సుమారు 317 ఎకరాలను రైతులకు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలాస మండలం కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని భూములను జేసీ-1 వివేక్‌యాదవ్ శుక్రవారం పరిశీలించారు.
 
 అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి రైతులను పిలిపించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు సాగు చేస్తున్నారో ఎంత భూమి ఉందని అనేది మరోసారి సర్వే చేయించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేసి ఎవరి వాటాకు చెందిన భూమిని వారికి కొద్దిరోజుల్లోనే అప్పజెపుదామని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు పాడి నారాయణ, పాడి సూర్యనారాయణ, కనగల ఫల్గుణరావు తదితరులు మాట్లాడుతూ న్యాయమూర్తులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. తాతముత్తాతల నుంచి నేటి వరకు సుమారు 150 ఏళ్ల పాటు ఈ భూములను నమ్ముకొని అనేక కష్టాలు అనుభవించామని వాపోయారు. సుదీర్ఘకాలంగా 33 కేసులు అనుభవించామని, ఒక్క ఆదివారం తప్ప మిగతా నెలలో అన్ని రోజులు కూడా కోర్టుల చుట్టూ తిరిగామన్నారు.
 
  సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల భూములను ముట్టితే ఓ కేసు, చేపలు పడితే మరోకేసు, రాలిన మామిడికాయ తీస్తే ఇంకో కేసు ఇలా ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా సోంపేట, శ్రీకాకుళం, పలాస కోర్టులు చుట్టూ పక్షుల్లా తిరిగామంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు కార్చారు. న్యాయమూర్తులు దయతలచి తమపై ఉన్న క్రిమినల్ కేసులన్నీ రద్దు చేశారని,  ఇప్పుడు భూమి కూడా ఇనాంయాక్టు కింద తమకు దాఖలు పర్చాలని చెప్పడం చాలా సంతోషకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చేతులెత్తి జోడించారు. దీనికి జేసీ వివేక్‌యాదవ్ స్పందిస్తూ ఇది చాలా మంచి తీర్పు అని, భూస్వామికి కూడా ఒక భాగం దక్కుతుందని, ఇరువర్గాలు కూడా రాజీపడి పరస్పరం సహకారంతో శాంతియుతంగా గ్రామంలో సహజీవనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ వివేక్‌యాదవ్‌తో పాటు ఆర్‌డ్వీవో ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ గన్నవరపు సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ బి.పాపారావు, సర్వేయర్లు ఉన్నారు.
 
 150 ఏళ్లుగా...
 కంబిరిగాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1 నుంచి 57 వరకు గల సర్వే నంబర్లలో 317.71 ఎకరాల భూమి ఉంది. ఇందులో పల్లం 216.67 ఎకరాలు కాగా, మెట్టు 37.63 ఎకరాలు, పోరంపోగు 63.41 ఎకరాలు. ఈ భూములను 1843 నుంచి కంబిరిగాం, కేదారిపురం, ఈదురాపల్లి రైతులు సాగు చేస్తున్నారు. ఇవే భూములపై 1915లో ఒడిశా చత్రపూర్ కోర్టులో భూస్వామి పరశురాంచౌదరి కుటుంబానికి, తర్లాకోట, పర్లాఖిమిడి రాజుల కు మధ్య కేసు నడిచింది. ఈ భూమిని బరంపురం బ్రాహ్మణులకు ఇనాం కింద తర్లాకోట, పర్లాఖిమిడి రాజులు దాఖలు పరచగా, వారి నుంచి పరశురాంచౌదరి కుటుంబీకులు సొం తం చేసుకున్నట్టు అప్పటి చరిత్ర చెబుతోంది. 1976లో భూ సంస్కరణల చట్టం ప్రకారం ఈ భూమి సాగుచేసిన రైతులకు దక్కాలి. అయితే, దీనిని పరశురాంచౌదరి కుటుంబీకులు అడ్డంపడ్డారు. ఎన్ని కేసులు పెడుతున్నా 1843 నుంచి నేటి వరకు ఆ భూములను సాగు చేస్తున్నది కేదారిపురం, ఈదురాపల్లి రైతులే. 1980లో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో పరశురాం కుటుంబీకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. 1984లో 90 మంది రైతులకు అనుకూలంగా కమిషనర్ ఆఫ్ లాండ్ రెవెన్యూ తీర్పు చెప్పింది. 1999లో సర్వే చేసి ప్రభుత్వం గజిట్ పబ్లికేషన్ కూడా చేపట్టింది. ఈ సర్వే పనికిరాదని పరశురాం కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు.
 
 దీంతో 122 మంది రైతులు థర్డ్‌పార్టీగా చేరి హైకోర్టుకు వెళ్లారు. దీంతో 1999లో హైకోర్టు తీర్పు చెబుతూ 12 వారాల్లో ఈ భూములను సర్వే చేసి హక్కు కల్పించాలని ఆదేశించింది. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అండతో రైతులు సాగుకు ఉపక్రమించినా పోలీసుల అండతో భూ స్వామి పరశురాంచౌదరి కుటుంబీకులు సాగును అడ్డుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో అధికారులు దిగి వచ్చారు. జేసీ-1 వివేక్‌యాదవ్ ఇచ్చిన భరోసాతో రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. భూ పోరాటానికి ఒక పరిష్కారం లభిస్తుందని, ఇనాం యాక్టు కింద ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని ఇటు అధికారులు, అటు ప్రజలు ఆశిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement