
జనం రాళ్లతో కొట్టే రోజులొస్తాయి
* వైద్యులు, సిబ్బందిలో తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి కామినేని
విజయవాడ: ‘రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యవ్యవస్థ గాడితప్పింది. ఏం జరిగినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో వైద్యులు, సిబ్బంది ఉన్నారు. ఇదే తీరు కొనసాగితే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. ఈ వ్యవస్థను మార్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని సక్రమంగా అమలు చేయలేకపోతే మమ్మల్ని ప్రజలు రాళ్లతో కొట్టే రోజులొస్తాయి..’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
ఆదివారం విజయవాడలోని సన్‌రైజ్ హాస్పిటల్‌లో జరిగిన కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్, వర్టిగో క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కామినేని మాట్లాడుతూ.. రాష్ట్రం లో గాడితప్పిన ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈనెల 18న అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యవిధాన పరిషత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి రెండు నెలల సమయం ఇస్తామని, పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని విభాగాల్లో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ)లో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందులో భాగంగా జనవరిలో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కార్డియోథోరాసిక్ విభాగం సేవలు ప్రా రంభిస్తామని వెల్లడించారు. అనంతరం దశలవారీగా అన్ని ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే 35 శాతం నిధులను ప్రైవేటు వైద్యులకు చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
కార్యక్రమం ముగించుకుని వెళుతున్న మంత్రి కామినేని వద్దకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ ప్రభుత్వ డాక్టర్‌ను తీసుకువచ్చి పరిచయం చేశారు. ‘పదోన్నతిపై తనను మరో ఆస్పత్రికి బదిలీ చేశారని.. పరిశీలించాలని’ ఆ డాక్టర్ కోరారు. దీనిపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘అది ప్రభుత్వ విధానం. ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకు ఒక రూల్ పాటిస్తున్నాం. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే మమ్మల్ని ప్రజలు రాళ్లతో కొడతారు..’ అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో అక్కడున్న ఎమ్మెల్యేతో పాటు ఇతర వైద్యులు కంగుతిన్నారు. విజయవాడ జీవీఆర్ సంగీత కళాశాలలో ఆదివారం జరిగిన గ్రామీణ వై ద్యుల సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడారు. కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ తరగతులను పునరుద్ధరిస్తానని వైద్యులకు హామీ ఇచ్చారు.