కుంభకోణం కంచికేనా ?
తాడేపల్లి రూరల్ : రూ. కోటీ 76 లక్షల కుంభకోణం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ కార్మికులందరినీ కలవరపాటుకు గురిచేసింది. జీడీసీసీ బ్యాంక్ అధికారులను సైతం షాక్ తినిపించింది. సొసైటీ యాక్ట్ 51 విచారణతో మొదలై పోలీసుల వద్దకు చేరింది. మేమే బాధ్యులమంటూ కొందరు తెరపైకి వచ్చారు. ఆ తరువాత కనుమరుగయ్యారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు.
బాధితులు మాత్రం ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ఆశతోఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం పీడబ్ల్యూడీ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణం కంచికి చేరినట్టేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తాడేపల్లి పట్టణం సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్ షాపు కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ సొసైటీలో కోటీ 76 లక్షల రూపాయల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.
కార్మికులకు సంబంధం లేకుండా సొసైటీ ప్రెసిడెంట్ కెకెడి ప్రసాద్, గుమస్తా వెంకటేశ్వరరావులు ఈ అవినీతి బాగోతంలో భాగస్వామ్యులు అంటూ జీడీసీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
వర్క్‌షాపులో పని చేస్తున్న 94 మంది కార్మికుల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రెసిడెంట్, గుమస్తా కలసి సొమ్ము స్వాహా చేసినట్టు విచారణలో తేలింది.
కార్మికులు తమ అవసరాల కోసం కో-ఆపరేటివ్ సొసైటీలో రుణాలు పొందేవారు. ఈవ్యవహారాన్ని సొసైటీ ప్రెసిడెంట్, గుమస్తాలు చూస్తుంటారు.
తిరిగి చెల్లించిన రుణాలు సక్రమంగా జమ కాకపోవటంతో బకాయి ఉన్నారంటూ జీడీసీసీ బ్యాంకు నుంచి కార్మికులకు నోటీసులు అందాయి. ఈ క్రమంలో బాధిత కార్మికులు సొసైటీ ప్రెసిడెంట్, గుమస్తాలను నిలదీయగా కుంభ కోణం బయటపడింది.
దీనిపై జీడీసీసీ బ్యాంక్ చైర్మన్, అధికారులు విచారణ చేపట్టారు. ప్రెసిడెంట్, గుమస్తాలే రూ. కోటి 76 లక్షల కుంభకోణానికి బాధ్యులని తేల్చి, సొసైటీ యాక్ట్ 51 ఎంక్వైరీ ద్వారా పూర్తి వివరాలు సేకరించాలని ప్రత్యేక అధికారిని నియమించారు.
కార్మికులు తాము చెల్లించిన రశీదులతో కూడిన వినతి పత్రాలను సదరు అధికారికి అందించారు. ప్రెసిడెంట్, గుమస్తాలు మాత్రం తిరిగి సొమ్ము చెల్లించేందుకు నిరాకరించటంతో బ్యాంకు అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదైన మరుక్షణమే ప్రెసిడెంట్, గుమస్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను విచారించటంతో కలుగులో నుంచి అవినీతి ఎలుకలు బయట కొచ్చాయి.
స్వాహా చేసిన సొమ్ము విడతల వారీగా చెల్లించేందుకు ప్రెసిడెంట్, గుమస్తాలు అంగీకరించారు. తొలి విడతగా పోలీసుల సమక్షంలో కొంత సొమ్ము జమ చేశారు. మిగిలిన సొమ్ము మరో 15 రోజుల్లో జమ చేస్తామంటూ నమ్మబలికారు.బాధిత కార్మికులు సైతం గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం ఈ కుంభకోణంపై పోలీసులుగానీ, బ్యాంక్ అధికారులుగానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ప్రెసిడెంట్, గుమస్తాలు మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.