రైతులకు వరి విత్తనాలు అందిస్తున్న మంత్రి కన్నబాబు
కాకినాడ రూరల్: రాష్ట్రంలో తొలిసారిగా గ్రామస్థాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై వరి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ఎంపీ వంగా గీతతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, మొదటిసారిగా రైతుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి, వాటిని శుద్ధి చేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ముందుకు సాగుతుందన్నారు.
లాక్‌డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టి ఆదుకుంటున్నారన్నారు. ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచుతామని, దీంతోపాటు సాగులో మెళకువలను తెలుసుకోవచ్చని వివరించారు. పచ్చిరొట్ట విత్తనాలకు 50 శాతం, వరి విత్తనాలకు కేజీకి రూ.5 చొప్పున రాయితీ అందిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 780 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 11,580 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో రాజీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment