సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టకపోగా, ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు చార్జీల పెంపు పేరుతో కొత్త నటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా చార్జీలు పెంచిన చంద్రబాబు నిర్ణయం సామాన్యుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తోంది. ఇప్పటికే వస్తున్న కరెంటు బిల్లులతో జేబులకు చిల్లు పడుతుంటే తాజా పెంపుతో ఎంత బిల్లు వస్తుందోనని గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలతోపాటు అన్ని వర్గాలపై చార్జీల భారం పడనుండడంతో ప్రతి ఒక్కరూ పెంపును వ్యతిరేకిస్తున్నారు.
‘బాబు’ దిష్టిబొమ్మల దహనం
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుచోట్ల ప్రభుత్వ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కడప అంబేద్కర్ సర్కిల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐటీఐ సర్కిల్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. ప్రొద్దుటూరులోని రాజీవ్ సర్కిల్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ నేతృత్వంలో బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బద్వేలులోని నాలుగు రోడ్ల సర్కిల్‌లో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి పెంచిన చార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కమిటీ సభ్యుడు శివశంకర్, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎప్‌ఐ భరత్, ఓబులేశు మాట్లాడుతూ పెంచిన కరెంటు చార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోందని అన్నారు. విద్యుత్ చార్జీల విషయంలో సీఎం చంద్రబాబునాయుడు గత విధానాలే అనుసరిస్తున్నారని విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఓబయ్య, దస్తగిరిరెడ్డి, బాలచెన్నయ్య, తులసీరాం, శివారెడ్డి, గడ్డం శీను, లక్ష్మీదేవి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.
సర్వత్రా కన్నెర్ర
Published Wed, Mar 25 2015 2:44 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement