సాక్షి, గుంటూరు : తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు దాచేపల్లిలో జరిగిన ఈ దారుణంపై స్థానికులు మండిపడుతున్నారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మాచర్లలో ముస్లింలు ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని... ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న బంద్..
బాలికపై అఘాయిత్యం నేపథ్యంలో దాచేపల్లిలో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమ దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడ్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన దాచేపల్లి గ్రామస్తులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా పరామర్శించారు.
ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి..
దాచేపల్లిలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను... అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. విషయం బయటపడడంతో సుబ్బయ్య పరారయ్యాడు. బాలిక బంధువులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు.
చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేసి... కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. వెంటనే న్యాయం చేయాలంటూ రాత్రంతా అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై బైఠాయించారు. రోడ్డుపై టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిందితుడిని శిక్షించాలంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో దాచేపల్లిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామైంది.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని జిల్లా కలెక్టర్ శశిధర్ పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిగిన ఘటన అత్యంత బాధాకరమైందని, చిన్నారి ఆరోగ్యం నిలకడగా వుందని, దాచేపల్లిలోనే ఎస్పీ ఉండి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించినట్టు తెలిసింది. నిందితుడిని పట్టుకొని.. కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment