సాక్షి, అమరావతి: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించడంపై కాపు నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన అయితే తమకు కనీసం 11 శాతం రిజర్వేషన్లు రావాలని చెబుతున్నారు. కమిషన్ సభ్యులు అభిప్రాయపడినట్టయితే 6 శాతం రావాలంటున్నారు. 5 శాతం ఎవరి ప్రతిపాదన అని వారు ప్రశ్నిస్తున్నారు. బలహీనవర్గాల జాబితాలోని ఇతర సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు తమకూ అలానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బూటకపు లెక్కలు చెప్పారు..
ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న 4,81,362 మందికన్నా ఎక్కువ మంది తెలగలు ఉంటారని కాపునేతలు వివరిస్తున్నారు. 1931 జనాభా లెక్కల ప్రకారం తెలగ జనాభా 6.99 లక్షలైనపుడు ఇప్పుడు 4.81 లక్షలే అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. కాపులు మొత్తం 38 లక్షలేనని చెప్పడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఏయే జిల్లాల్లో కాపుల లెక్కలు తీశారో చెప్పాలన్నారు. ప్రజాసాధికారిత సర్వే ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. ప్రజాసాధికారిత సర్వే ప్రకారం 38,09,326 మంది కాపులు, 4,81,321 మంది తెలగలు, 7,51,031 మంది బలిజలు, 13,058 మంది ఒంటరి కులస్తులు ఉన్నారు. అయితే ఈ లెక్కలు అసత్యమని, మళ్లీ సర్వే చేయించాలని కాపునేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మిగతా కులాల లెక్కలు కూడా బయటపెట్టాలని కోరుతున్నారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కాపుల్ని లెక్కించినా 50 లక్షలకు దాటతారని పేర్కొన్నారు. ఇంత తక్కువగా కాపులు ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అసలు రిజర్వేషన్ అంశాన్నే పరిగణనలోకి తీసుకునేది కాదని, కాపుల ప్రభావాన్ని తక్కువ చేసి చూపేందుకు ఈ కాకిలెక్కలు చెప్పారని కాపునాడు సీనియర్ నేత ఒకరు తెలిపారు.
రిజర్వేషన్లను తగ్గించేందుకే ఈ ఎత్తుగడ...
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు దాదాపు 80 లక్షలు ఉంటారని కాపునేతలు చెబుతున్నారు. వాస్తవ సంఖ్యను చెబితే అన్ని రంగాల్లో ఎక్కువ వాటా అడుగుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుదించి చూపించిందని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశమేనని అంటున్నారు. రిజర్వేషన్లను కుదించి చూపేందుకే ప్రజా సాధికారిత సర్వేను అడ్డం పెట్టుకున్నారని వివరించారు. 5 శాతానికి మించి ఇవ్వకూడదని ప్రభుత్వం ముందే నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా లెక్కలు చూపినట్టుందని విమర్శిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం తమ కులాలకు కనీసం 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాపు జనాభాను తగ్గించారా?
Published Sun, Dec 3 2017 1:26 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment