కాపు జాబ్‌మేళాలో తిరుగుబాటు
- సీఎం మీటింగ్ కోసం ఇంటర్వ్యూలు నిలిపివేసిన కంపెనీలు
- నిరుద్యోగుల నినాదాలు.. లాఠీలతో తరిమికొట్టిన పోలీసులు
సాక్షి, అమరావతి: కాపు విద్యార్థుల జాబ్‌మేళాలో విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడ్డారు. కాపు విద్యార్థులకు ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజీలో నిర్వహిస్తున్న కాపు జాబ్‌మేళాలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరి గింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను, నిరుద్యోగులను కాపు కార్పొరేషన్.. కాలేజీకి పిలిపించింది. ఆ తర్వాత సీఎం సభ ఉందంటూ ఇంటర్వ్యూలను ఆపేసింది. దీంతో సాయంత్రం మూడున్నర గంటలకు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలేజీ లోపలి నుంచి ముఖ్యమంత్రి వేదిక వద్దకు వచ్చారు. ‘ఉయ్‌వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు.
సీఎం సభ ముగిసిన తరువాత మళ్ళీ ఇంటర్వ్యూలు జరుపుతామని కంపెనీల వారు హామీ ఇచ్చినా నిరుద్యోగులు ఆందోళన విరమించలేదు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు నిరుద్యోగులను చొక్కాలు పట్టుకొని పోలీసులు ఈడ్చుకుపోయారు. మరికొందరిపై లాఠీ ఝుళిపించారు. ఈ సమయంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ నిరుద్యోగుల మధ్యలోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మీ పార్టీ కోసం ఉద్యోగాల పేరుతో మమ్మల్ని ఇక్కడకు రప్పించి ఇంటర్వ్యూలు కూడా చేయకుండా ఇబ్బం దులు పెడతారా? అంటూ రామానుజయను నిలదీసేందుకు నిరుద్యోగులు చుట్టుముట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, కాపు విద్యార్థినీవిద్యార్థుల జాబ్‌మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 1300 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించగా.. 500 మందికి మాత్రమే వచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. మరోవైపు కానూరులో అన్నే కల్యాణమండపంలో బూరగడ్డ వేదవ్యాస్‌తోపాటు పలువురు టీడీపీలో చేరారు.