కరీమ్ హత్య కేసులో టీడీపీ నేత అరెస్టు
సర్పంచి భర్తే ప్రధాన నిందితుడు
మరో ఇద్దరి కోసం గాలింపు
కొండమోడు (పిడుగురాళ్ళ) : కొండమోడు గ్రామానికి చెందిన సయ్యద్ కరీమ్‌ను హత్య చేసిన టీడీపీ నాయకుడు వేముల కాశీ విశ్వనాథబాబును శ నివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పిడుగురాళ్ళ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జి సీఐ వై.శ్రీధర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన మాటలో... 2015 సెప్టెంబర్ 3న పట్టణలోని తహశీల్దార్ కార్యాలయం వెనుక వైపు ఉన్న నాగరాజు ఇంట్లో కరీమ్‌కు మద్యంలో విషం కలిపి చంపిన కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడు కొండమోడు గ్రామానికి చెందిన వేముల కాశీవిశ్వనాథబాబు కొన్నిరోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు.
ఈయన టీడీపీ ప్రధాన నాయకుడు కావడంతో రాజకీయ పలుకుబడితో బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. లాభం లేకపోవడంతో శుక్రవారం వీఆర్వో మధుసూదనరావు వద్ద లొంగిపోయాడు. వీఆర్వో వెంటనే విశ్వనాథబాబును పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డికి అప్పగించారు. విశ్వనాథబాబును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు. కేసులో రెండో ముద్దాయి విశ్వనాథబాబు అక్క జూలకంటి నాగలక్ష్మి, 8వ ముద్దాయి కిశోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు
కరీమ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వేముల కాశీవిశ్వనాథబాబు టీడీపీ నాయకుడు కావడంతో పాటు అతని భార్య వేముల నాగమణి సర్పంచిగా ఉన్నారు. వీరు రాజకీయ ప్రముఖులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఈ కేసును నీరుగార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.