చేబ్రోలులో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్ చిత్రంలో నిందితులు
పశ్చిమగోదావరి, ఉంగుటూరు: స్నేహితుడే అతడి పాలిట కాలయముడయ్యాడు.. మరో ముగ్గురితో కలిసి ఊపిరాడకుండా చేసి వ్యక్తిని తుదముట్టించాడు. ఫుల్లుగా మద్యం తాగించి అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్లి నార్ణి వేంకటేశ్వరరావు (44) అనే వ్యక్తిని తలగడతో ఊపిరాడకుండా చేసి అంతమొందించారు. డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్ చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో సో మవారం కేసు వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెంకు చెందిన నార్ణి వెంకటేశ్వరరావు ఫైనాన్స్‌లో రెండు లారీలు తీసుకుని నడుపుతున్నారు. ఒక లారీని ఐదు నెలల క్రితం స్నేహితుడు దంతులూరి మణికంఠవర్మకి కంటిన్యూ ఫైనా న్స్ కింద అప్పగించారు. అయితే మణికంఠవర్మ ఫైనాన్స్ సరిగా చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావు నిలదీశారు. లారీని తనకు ఇచ్చేయమని మందలించారు. దీంతో కోపం పెంచుకున్న మణికంఠవర్మ తన స్నేహితులు షేక్ అరాఫత్, పట్నాల వెంకటేశ్వరావు (వెంకటేష్), కోటి సాయిబాలాజీతో కలిసి వెంకటేశ్వరరావును హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించాడు. దీనిలో భా గంగా ఈనెల 7న వెంకటేశ్వరరావును కారులో భీమవరం తీసుకువెళ్లారు. అక్కడ బారులో వీరంతా కలిసి మద్యం తాగారు.
వెంకటేశ్వరరావు తాగిన మద్యంలో మణికంఠవర్మ నిద్రమాత్రలు కలిపాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న వెంకటేశ్వరరావును కారులో ఉండి, గణపవరం మీదుగా రావులపర్రు తోకలపల్లి కోడు వంతెన వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ అతడిని తలగడతో ఊపిరి ఆడకుండా నొక్కి హతమార్చారు. మృతదేహాన్ని నాచుగుంట బ్రిడ్జి మీద నుంచి ఏలూరు కాలువులోకి విసిరేశారు. 8వ తేదీన చేబ్రోలులో వెంకటేశ్వరరావు మృతదేహాన్ని చేబ్రోలు పోలీసులు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. సీఐ భగవాన్‌ప్రసాద్, ఎస్సై వీర్రాజు కేసు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులు మణికంఠవర్మ, అరాఫత్, పట్నాల వెంకటేశ్వరావు, కోటి సాయిబాలాజీని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ దిలీప్‌కిరణ తెలిపారు. ఎ–1 నిందితుడు మణికంఠవర్మది తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లి గ్రామం కాగా కొంతకాలంగా తాడేపల్లిగూడెంలో ఉంటున్నాడు. మిగిలిన ముగ్గురు నిందితులది తాడేపల్లిగూడెం. వీరు నలుగురిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించారు. హత్య కేసు చేధించిన సీఐ, ఎస్సై, హెచ్‌సీ కె.నాగరాజు, కానిస్టేబుళ్లు గు మ్మడి శ్రీను, సబ్బే నాగరాజు, సీహెచ్ భీమరాజు, కె.సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment