
దిక్కుతోచని స్థితిలో మృతుని భార్య, పిల్లలు మృతి చెందిన నారాయణస్వామి
ఒక్కగానొక్క కొడుకు..అల్లారు ముద్దుగా పెంచుకున్నారు..ఓ ఇంటివాన్ని చేసి సంబరపడ్డారు..మనవడు, మనవరాలితో నవ్వులపువ్వులు..ఈ జీవితానికి ఇంకేం కావాలనుకున్నారు..మద్యం మహమ్మారి
ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది..తల్లి చీరను లాగే స్థాయికి తీసుకెళ్లింది..కన్నపేగు తిరగబడింది..చీరకొంగు ఉరితాడైంది..ఏడడుగుల బంధం ముగిసింది..పిల్లలకు నాన్న పిలుపు దూరమైంది..
అనంతపురం,లేపాక్షి:మద్యం మత్తులో తల్లి చీర కొంగు లాగిన కుమారునికి ఆ తల్లిదండ్రులు ఉరిపోసిన ఘటన మండలంలోని శిరివరంలో చోటు చేసుకుంది. హిందూపురం రూరల్ సీఐ ధరణీకిశోర్ తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన కదిరమ్మ, నరసింహప్ప దంపతుల ఏకైక కుమారుడు నారాయణస్వామి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. బెంగళూరులో బేల్దార్ పని చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చివెళ్లే నారాయణస్వామి మద్యానికి బానిస య్యాడు. ఊరికి వచ్చినప్పుడల్లా మద్యం తాగి భార్య, తల్లిదండ్రులతో గొడవపడే వాడు. దీంతో వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం పిల్లలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం రాత్రి 8 గంటల సమయంలోబాగా మద్యం సేవించిన నారాయణస్వామి తల్లిదండ్రులతో గొడపడ్డాడు. ముగ్గురూ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో తల్లి కదిరమ్మ చీరను పూర్తిగా లాగేశాడు. సహనం కోల్పోయిన తల్లిదండ్రులు అదే చీరను నారాయణస్వామి మెడకు బిగించడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ధరణీకిశోర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment