భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్:
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠ రాముడు ప్రత్యేక వేదికపై కొలువుదీరగా భారీగా తరలివచ్చిన భక్తులు గోదావరి మాతకు హారతులతో నీరాజనం పలికారు. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల హారతులతో గోదావరి మాత పులకించింది. జైశ్రీరామ్ , జైజై శ్రీరామ్ నామస్మరణలతో గౌతమీ తీరం మార్మోగింది. రాముడి పాదాల చెంత జీవనదిగా విరాజిల్లుతున్న
గోదావరి వద్దకు సీతారామచంద్రస్వామి వేంచేయగా, ఆలయ అర్చకులు సమర్పించిన నదీహారతి కనువిందు చేసింది.
గౌతమీ తీరాన రామయ్యకు ప్రత్యేక పూజలు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి మాతకు నదీహారతి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తొలుత ఆదివారం మధ్యాహ్నం మేళతాళాలు, భక్తుల కోలాటాలు, బాణసంచాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా వేదపండితులు, ఆలయ అర్చకులు స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, అష్టోత్తర శతనామార్చన, మంగళవాయిద్యం, చతుర్వేద పారాయణం గావించారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు స్వామివారికి ద్వయ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ, అష్టోత్తర శత హారతులు సమర్పించారు.
గోదావరి మాతకు ప్రత్యేక పూజలు ...
నదీహారతి సందర్భంగా ఆలయ ఈవో రఘునాథ్ గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిముఖంగా నది మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవపై ఆలయ అర్చకులు గోదావరి మాతకు ద్వయ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ, అష్టోత్తర శత హారతులు సమర్పించారు. దేవస్థానం వారు అందచేసిన దీపాలతో భక్తులు నదీహారతులు సమర్పించారు. వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర అందజేశారు.
కార్యక్రమంలో ఏఈవో శ్రవణ్‌కుమార్, ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, సీఐలు కె. శ్రీనివాసరెడ్డి, భోజరాజు, ఎస్సై ఎం.అబ్బయ్య, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లలో అధికారులు విఫలం. తగ్గిన భక్తుల సంఖ్య..
రాష్టస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి నదీహారతికి భక్తుల స్పందన కరువైంది. పదివేల మంది భక్తులను రప్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆలయ ఈవో, అధికారులు ఆది నుంచీ ప్రకటించినా, కార్యాచరణలో విఫలమయ్యారు. జిల్లా, డివిజన్ వ్యాప్తంగా ప్రచారం కరువవడంతో, గోదావరి స్నానానికి వచ్చిన భక్తులే పాల్గొన్నారు. నిర్వహణ ఏర్పాట్లు కూడా చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. నదీహారతి వేదిక వద్దకు స్వామి వారిని తీసుకొచ్చిన సమయానికి కూడా వేదికను పూలతో అలంకరించకపోవటం గమనార్హం. గతేడాది రంగురంగుల, వైవిధ్యమైన బాణసంచా కాల్చగా, ఈ ఏడాది మొక్కుబడిగా తీసుకొచ్చారు. చాలా టపాసులు పేలనేలేదు. స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం తో ఆలయ అధికారులు మమా అనిపించారు.
రామాలయంలో కృత్తికా దీపోత్సవం...
కార్తీక పౌర్ణమి సందర్భంగా రామాలయంలో ఆదివారం కృత్తికాదీపోత్సవాన్ని నిర్వహించారు. నదీహారతి అనంతరం ఆలయంలోని యాగశాలలో పూర్ణాహుతి, చొక్కాసుర దహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామివారికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించారు.
రామాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
Published Mon, Nov 18 2013 7:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement