పవిత్ర కార్తీక మాసం.. అందునా చివరి సోమవారం... అంత టా పూజలు, పునస్కారాలతో ఆధ్యాత్మిక తరంగం.. మరోవైపు తోటి స్నేహితులతో కలసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు చెక్‌డ్యాంలో ఈతకొడుతూ గల్లంతయ్యాడు. చివరకు తమ మిత్రుడు కన్పించలేదని గుర్తించిన స్నేహితులు గాలించారు. ఫలితం లేదు. అప్పటికే చీకటి పడటంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. మరుసటి రోజు గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. గల్లైంతన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.
- జమ్మలమడుగు
జమ్మలమడుగులోని వెంకటేశ్వరకాలనీకి చెందిన జి.నరేశ్(23) ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో బంధువులు, స్నేహితులతో కలసి మైలవరం మండలం రామచంద్రాయపల్లె సమీపంలోని రంగనాయకునికోనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం కోన పైభాగంలోని చెక్‌డ్యాంలో స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లారు. అక్కడ నరేశ్ గల్లంతయ్యాడు.
ఆలస్యంగా గుర్తించిన స్నేహితులు
అందరూ ఈతకొడుతున్నారు.. అయితే తమలో ఒకరు లేరనే విషయాన్ని మిగిలిన వారు గుర్తించలేకపోయారు. ఈత కొట్టడం అయ్యాక ఎవరికి వారు గట్టుపైకి వచ్చారు. బట్టలేసుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. అయితే వారికి చెక్‌డ్యాం గట్టుపై ఫ్యాంటు, చొక్కా కన్పించాయి. అవి నరేశ్‌వని గుర్తించారు. అతని కోసం గాలిస్తే కన్పించలేదు.
చెక్‌డ్యాంలో గాలించినా...
నరేశ్ లేకపోవడంతో ఆందోళనకు గురైన మిత్రులు వెంటనే చెక్‌డ్యాంకు వెళ్లి గాలించారు. ఎంత సేపు గాలించినా ఫలితం లేదు. అంతలోనే చీకటిపడటంతో వారు చేసేది లేక వెనుదిరిగారు. విషయాన్ని గ్రామంలో అందరికీ తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా ఏడుస్తూ గడిపారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
ఎస్‌ఐ విద్యాసాగర్ చొరవతో...
మంగళవారం ఉదయమే ఎస్‌ఐ విద్యాసాగర్ గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు చెక్‌డ్యాంలో గాలించారు. కొండరాళ్ల మధ్య నరేశ్ మృతదేహం ఉండటాన్ని గుర్తించి బయటికి తీశారు. వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. మృతదేహాన్ని వైస్ చైర్మన్ ముల్లా జానీ, ఆర్‌ఆర్ సోషియో కల్చరల్ అధ్యక్షుడు కె.వి.రమణారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమవంతు ఆర్థిక సాయం అందించారు.
కార్తీక సోమవారం కడు విషాదం
Published Wed, Nov 19 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement