భాగ్యనగర్‌కాలనీ: ఈత నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారిని పర్యవేక్షించాల్సిన నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం జలసమాధి అయ్యింది. ఈత నేర్చుకోవడం మొదలుపెట్టిన నాలుగు రోజులకే బాలుడిని కొలనులో వదిలేయడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ రంగారెడ్డినగర్ పంచశీలకాలనీకి చెందిన నర్సింగరావు కుమారుడు బిరదార్ ఓంకార్ (12), వివేకానందనగర్‌కాలనీలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తండ్రి నర్సింగరావు టీ స్టాల్ నడిపిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే శనివారం ఉదయం నర్సింగరావు టీస్టాల్ వద్దకు వెళ్లగా 8.30 గంటలకు తల్లికి తాను ఈతకు వెళ్తున్నానని చెప్పిన ఓంకార్.. పాపారాయుడునగర్‌లోని రాహుల్ స్విమ్ అకాడమీకి వెళ్లాడు. మధ్యాహ్నమైనా కుమారుడు ఇంటికి రాలేదు. లతాబాయి, చిన్నారి బాబాయి వివేక్ స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లగా ఒడ్డున ఓంకార్ దుస్తులు కనిపించడంతో పరిసరాల్లో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి కోచ్‌ల సహాయంతో స్విమ్మింగ్‌పూల్‌లో వెదికారు. కొలను అడుగు భాగంలో ఉన్న ఓంకార్‌ను ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
నిర్లక్ష్యమేనా..?
ఈత కొట్టాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఏ విధంగా ఓంకార్‌ను స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించారని మృతుడి బంధువులు, తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈత కోసం బాలుడు వచ్చాడని ఎలాంటి సమాచారం కూడా తల్లిదండ్రులకు అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించినప్పుడు కోచ్‌ల పర్యవేక్షణ అయినా ఉండాలి. అది కూడా లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందారని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. నిర్వాహకుడు రాహుల్‌కు పోలీసులు ఫోన్ చేసినా స్విచ్ఛాప్ చేసి ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment