అమరావతిలో కార్వీకి చౌకగా భూమి | Karvy Data Management Services Get Land In Amravati | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 1:20 PM | Last Updated on Sat, Dec 15 2018 4:07 PM

Karvy Data Management Services Get Land In Amravati - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం కారుచౌకగా భూమిని కేటాయించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పార్కు నెలకొల్పేందుకు రిలయన్స్‌ ప్రోలిఫిక్‌ ట్రేడర్స్‌కు 175 ఎకరాలను కేటాయించడంతోపాటు గ్రాంట్‌ రూపంలో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎక్స్‌ట్రాన్‌ సర్వర్స్‌ సంస్థకు పెట్టుబడికి మించి 121 శాతం రాయితీలు ఇవ్వడంతోపాటు 5.64 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం వేర్వేరుగా మూడు జీవోలు జారీ చేశారు.  

భూకేటాయింపులోనే రూ.58.29 కోట్ల లాభం
అమరావతిలో మెగా ఐటీ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని, 16.42 ఎకరాలను ఎకరం రూ.55 లక్షల చొప్పున కేటాయించాలని కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒక్కో ఉద్యోగం కల్పనకు రూ.50 వేల చొప్పన రాయితీ ఇవ్వాలని పేర్కొంది. రాజధానిలో ఎకరం ధర రూ.4.1 కోట్ల దాకా ఉన్నందున 16.42 ఎకరాల ధర రూ.67.32 కోట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కార్వీ సంస్థ కోరినట్లు ఎకరం రూ.55 లక్షల చొప్పున ధరకే కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయించింది. దీంతో రూ.67.32 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.9.03 కోట్లకే కార్వీకి దక్కనుంది. అంటే ఆ సంస్థకు భూకేటాయింపులోనే రూ.58.29 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. అలాగే ఉద్యోగాలు ఇస్తున్నందుకు గాను రాయితీగా రూ.60.1 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కార్వీ సంస్థ రూ.390 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

ప్రోలిఫిక్‌ సంస్థకు రూ.50 కోట్ల గ్రాంట్‌
తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పార్కు ఏర్పాటుకు రియలన్స్‌ ప్రోలిఫిక్‌ ట్రేడర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎకరం రూ.20 లక్షల చొప్పున 175 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ రూ.127.43 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి అదనంగా ప్రభుత్వం రూ.50 కోట్ల మేర గ్రాంట్‌గా మంజూరు చేయనుంది. 3,750 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రోలిఫిక్‌ సంస్థ పేర్కొంది.  

పెట్టుబడికి మించి రాయితీలు
తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎక్స్‌ట్రాన్‌ సర్వర్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 5.64 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 900 మందికి ఉపాధి కల్పిస్తామని ఈ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ పెట్టే పెట్టుబడికి మించి 121.7 శాతం రాయితీలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్స్‌ట్రాన్‌ సంస్థ పెట్టే పెట్టుబడి రూ.359.7 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల విలువ రూ.437.85 కోట్లు కావడం గమనార్హం. ఏపీ ఐటీ విధానం ప్రకారం.. పెట్టుబడిలో 30 శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. తిరుపతి సమీపంలో ఎకరం భూమి విలువ రూ.56 లక్షలు కాగా, ఎక్స్‌ట్రాన్‌కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 5.64 ఎకరాలు  కేటాయించారు. ఒక్కో ఉద్యోగ కల్పనకు రూ.10 వేల చొప్పున రాయితీ ఇస్తామని, ఐదేళ్లపాటు 25 శాతం మేర విద్యుత్‌ సబ్సిడీ ఇస్తామని, ఐదేళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఇస్తామని,  వ్యాట్, జీఎస్‌టీతోపాటు ఫిక్స్‌డ్‌ కేపిటల్‌ పెట్టుబడిని 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement