కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమై తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మాత్రం 6వ తరగతి ప్రవేశాలు ఇంకా మొదలు కాలేదు. పాఠశాలలు ప్రారంభించే వరకు ఎప్పటిలాగే ప్రవేశాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటేనే పరిశీలిస్తామని చెప్పడంతో నిరుపేద బాలికలు ఖంగుతున్నారు. ఎలాగోలా కష్టపడి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే ఇప్పటికి వరకు ప్రవేశాలు కల్పించకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు.
29 కేజీబీవీల్లో...
జిల్లావ్యాప్తంగా 29 కేజీబీవీల్లో 1118 సీట్లు ఉండగా 1246 దరఖాస్తులు వచ్చాయి. దీంతో తమకు సీట్లు వస్తాయో రావోనన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. దరఖాస్తులకు అనుగుణంగా సీట్లను పెంచుతారా లేక నిర్ణయించిన మేరకే ఆడ్మిషన్లను తీసుకుంటారా అనే సందిగ్ధం కొనసాగుతుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్ది పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఇక్కడ సీటు వస్తే సరి లేకుంటే ఎక్కడికి వెళ్లి చేరాలని ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్ది బయట ఉన్న పాఠశాలల్లో సిలబస్ సుమారుగా అయిపోయి ఉంటుందని కలవరపడుతున్నారు. అధికారులు స్పందించి కేజీబీవీల్లో అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వచ్చేవారం లోగా ప్రవేశాలు
జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పరిశీ లించి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రవేశాలు కల్పిస్తాం. ఈ పక్రియ వచ్చే వారం లోగా పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా డ్రాపౌట్స్, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రయారిటీ ఇస్తాం. తరువాత మిగిలిన వారికి సీట్లను కేటాయిస్తాం. – విజయ్‌కుమార్,ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి
Comments
Please login to add a commentAdd a comment