
కేసీ నీటి కోసం పోరాటం
సాక్షి ప్రతినిధి, కడప: కేసీ కెనాల్ ఆయకట్టుదారుల భవిష్యత్ ప్రశ్నార్థక ం కావడంతో వైఎస్సార్‌సీపీ పోరాటానికి సన్నద్ధమవుతోంది. శ్రీశైలం జలాశయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాయి. కనీస నీటిమట్టం నిల్వకు సైతం పాతర వేస్తున్నారు. రాయలసీమ వాసులకు తాగునీరు దక్కేందుకు కూడా ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారు. పాలకుల నిర్వాకంపై వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు పిడికిలి బిగించనున్నారు.
అందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును కలిసి పరిస్థితిని వివరించనున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌భాష, రాచమల్లు ప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టి జయరాములు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి మంత్రిని కలిసి జిల్లా తాగు, సాగునీటి అవసరాలపై వివరించనున్నారు.
శ్రీశైలంలోకి నీటి ప్రవాహం తగ్గి, నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు నీరు అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పాదన చేపట్టేవారు. ఫిబ్రవరి ఆఖరు వరకు శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కనీసస్థాయి నీటిమట్టాన్ని ఉంచేవారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ శ్రీశైలం కుడి, ఎడమ గట్ల వద్ద రెండు ప్రభుత్వాలు పోటీపడి విద్యుత్ ఉత్పాదన చేపట్టాయి. ఫలితంగా అక్టోబర్ చివరినాటికే నీటిమట్టం కనీసస్థాయికి చేరుకుంది. ఫలితంగా కడప, కర్నూలు జిల్లాల్లోని 2.50 లక్షల ఎకరాల కేసీ కెనాల్ ఆయకట్టు, 1.60 లక్షల ఎస్‌ఆర్‌బీసీ ఆయకట్టు, 3.25 లక్షల ఎకరాల తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీరు విడుదల ప్రశ్నార్థకమైంది.
ప్రభుత్వ ప్రకటనతోనే.....
సెప్టెంబర్ మొదటి వారంలో నీరు విడుదల చేస్తామని, రైతులు పంటల సాగు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయకట్టు రైతులు వరితో పాటు వివిధ పంటలు సాగుచేశారు. కేసీ కెనాల్ కింద వరినాట్లు పూర్తయ్యాయి. ఈ పంటలు చేతికి అందాలంటే జనవరి 15వ తేదీ వరకైనా శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని ఉంచాలి. రాయలసీమ ప్రాంతంలోని ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీల నీటిని, చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీల నీటిని, తెలుగుగంగ ఆయకట్టుకు 25 టీఎంసీల నీటిని, కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు 10 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి కేటాయింపులు చేపట్టారు.
ఈ నీటిలో ఇంత వరకు ఎస్‌ఆర్‌బీసీకి 8 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 10 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నీటిని జనవరి 15 వరకు విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచాలి. వైఎస్సార్ జిల్లాలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ నీరు కూడా విడుదల కాలేదు. గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌కు ఈయేడు 6 టీఎంసీలు, మైలవరం రిజర్వాయర్‌కు 3 టీఎంసీలు విడుదల చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేట్లు కనిపించడంలేదు.
అంతేకాకుండా హెచ్‌ఎల్‌సీ ద్వారా వైఎస్సార్ జిల్లాలోని పీబీసీకి 4 టీఎంసీలు, మైలవరానికి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అవి ఏనాడూ వైఎస్సార్ జిల్లాకు రావడం లేదు. ఈ పథకాలకు అందాల్సిన నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. కేటాయింపులు జరిగిన నీటిని ఎస్‌ఆర్‌బీసీ ద్వారా గండికోట, మైలవరం రిజర్వాయర్‌లకు మళ్లించాలి.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జనవరి 15 వరకు శ్రీశైలంలో 854 అడుగల నీటి మట్టం ఏమాత్రం తగ్గకుండా చర్యలు తీసుకుని రాయలసీమ జిల్లాలకు సాగునీటిని అందించాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. ఈ విషయాలన్నీ చర్చించుకునేందుకు గాను కృష్ణాబోర్డును రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసినా అటు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లకు అనువుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.