లే–ఆఫ్ జాబితాలో తమ పేర్లు చూసుకుంటున్న కార్మికులు
చల్లపల్లి (అవనిగడ్డ), కృష్ణాజిల్లా : పండగ వేళ కేసీపీ యాజమాన్యం తమ కార్మికులపై శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో 206 మందికి లే–ఆఫ్ వర్తింపచేస్తూ ప్రకటించింది. ఈ మేరకు కేసీపీ ఆవరణలోని గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేసింది. కర్మాగారంలో పర్మినెంట్ పద్ధతి కింద పని చేస్తున్న 69 మంది కార్మికులు, క్రషింగ్ సీజనల్ పర్మినెంట్ పద్ధతిపై పని చేస్తున్న 137 మంది కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేశారు. మరో 46 మంది పర్మినెంట్ కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేయకుండా ఉపశమనం కల్పించారు.
సోమవారం నుంచే అమలు..
పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని సెక్షన్ 2 (కేకేకే) ప్రకారం లక్ష్మీపురంలోని కేసీపీ షుగర్స్ కర్మాగారంలోని ఉద్యోగులకు ధ్రువీకరించిన స్టాండింగ్ ఆర్డర్స్ క్లాజ్ 7(బి) ప్రకారం సోమవారం నుంచి లే–ఆఫ్ ప్రకటిస్తూ బోర్డు ఏర్పాటు చేసింది. లే–ఆఫ్ వర్తింపచేయని 46 మంది పరి్మనెంట్ కార్మికులను ఉయ్యూరులోని కేసీపీ షుగర్స్‌లో వినియోగించుకోనున్నట్లు తెలిసింది.
నష్టాలు కారణం..
రెండు సంవత్సరాలుగా చెరకు లభ్యత లేకపోవటంతో కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కేసీపీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా పంచదార నిల్వలు అధికంగా పేరుకుపోవటంతో పాటు, కేసీపీ లక్ష్మీపురం కర్మాగారం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెరకు పరిమాణం ఫ్యాక్టరీ సామర్థ్యాని కంటే చాలా తక్కువగా ఉంటోందని తెలిపింది. దీంతో కర్మాగారంలో క్రషింగ్ కొనసాగిస్తే ఆరి్థకంగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంగా తాత్కాలికంగా ఇక్కడి చెరకు పంటను ఉయ్యూరు కర్మాగారానికి తరలించి క్రషింగ్ చేయటానికి తీసుకున్న నిర్ణయం అమలులో భాగంగా లక్ష్మీపురం కర్మాగారంలోని కార్మికులకు లే–ఆఫ్ వర్తింప చేసినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment