కలకలం రేపిన ఉప ముఖ్యమంత్రి
కృష్ణమూర్తి వ్యాఖ్యలు
పదవుల కేటాయింపులపై నేతలు గుర్రు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో భారీఎత్తున అభివృద్ధి సాగుతోందంటూ ఇతర జిల్లాల్లో గోబెల్స్ ప్రచా రం సాగుతుండటం జిల్లా ప్రజలను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. జిల్లాలో చెప్పుకోదగిన ఒక్క కార్యక్రమం చేపట్టకపోయినా ఇక్కడ నిధులు కుమ్మరిస్తున్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ మినీ మహానాడు సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించడం చ ర్చనీయాంశమైంది. దీనిపై ఆదివారం స్పందించిన సీఎం చంద్రబాబు కర్నూలును సైతం అభివృద్ధి చేశామనడాన్ని చూస్తుంటే టీడీపీ నేతలు హైడ్రామాకు తెరలేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు చంద్రబాబు ఎనిమిది సార్లు వచ్చినా ఒరిగిందేమీ లేదు. ఒక్క నిట్ కేటాయింపు మినహా ఏదీ ముందుకు సాగలేదు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుంటే అభివృద్ధి జరిగిపోతుందనే హైడ్రామా నడుస్తోంది. ఏడాది పాలనపై వేదికలెక్కి అసంతృప్తి వెళ్లగక్కడం ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా ప్రజల వద్ద మంచి మార్కులు కొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. పాలకొల్లులో శనివారం జరిగిన మినీ మహా నాడులో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఏడాది పాలన తమకు సంతృప్తినివ్వలేదని మొసలి కన్నీరు కార్చారు.
రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు అండగా నిల వాలని కోరటం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పదవుల విషయంలో చంద్రబాబు తమకు న్యాయం చేయలేకపోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచర గణం వాపోతోంది. ఆదివారం భీమవరం మండలం రాయలంలో జరిగిన సమావేశంలో గాదిరాజు బాబు మాట్లాడుతూ చంద్రబాబు పార్టీ శ్రేణులను మభ్యపెడుతున్నారే తప్ప పదవుల విషయంలో సీనియర్ నాయకులకు న్యాయం చేయటం లేదని వాపోయారు. ప్రజల్లో వ్యక్తిగత ప్రాపకం పెంచుకునేందుకు ఇలాంటి మాటలు చెబుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడాది పాలనలో ఏమీ చేయలేకపోయామన్న అపప్రద నుంచి బయటపడేందుకే నాయకులు ఈ వ్యూహం పన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏమిటో.. ఈ మాయ!
Published Mon, May 25 2015 1:13 AM | Last Updated on Sat, Aug 11 2018 4:28 PM
Advertisement
Advertisement