రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచు గణనాయకా.. విభజన విఘ్నాలు తొలగించు వినాయకా.. అంటూ సమైక్యవాదులు విఘ్నేశ్వరుడికి ఆదివారం పూజలు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వినూత్న కార్యక్రమాలతో నిరసనలు చేపట్టారు. మైలవరం, కూచిపూడి తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్రకు మద్దతు హోమాలు నిర్వహించారు. మానవహారాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కొనసాగాయి.
సాక్షి , విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లా ప్రజలు వినాయకునికి పూజలు మొదలుపెట్టారు. పలుచోట్ల సమైక్య వినాయకుని ప్రతిరూపాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో వినాయకుని మట్టిప్రతిమలను భక్తులకు పంచిపెట్టారు. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సమీపంలోని వినాయకుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గార్మి షరీఫ్ దర్గాలో ప్రార్థనలు చేశారు.
హైదరాబాద్‌లో శనివారం జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగివస్తున్న సీమాంధ్ర బస్సులపై, ఉద్యోగులపై తెలంగాణవాదులు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్‌లో జేఏసీ, ఉద్యోగ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కుంటముక్కలలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆదివారం రాస్తారోకో చేశారు. జి.కొండూరు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పులివాగు వంతెన సమీపంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. విస్సన్నపేటలో నిర్వహిస్తున్న రిలే దీక్ష 12వ రోజుకు చేరింది.
కొండపల్లిలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు ఏడోరోజుకు చేరాయి. మైలవరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు శాంతిహోమం, లక్ష్మీగణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. మొవ్వ మండలం కూచిపూడిలో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో హోమం జరిపారు. ఈస్ట్ కృష్ణా జేఏసీ ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరుసెంటరులో తలపెట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరానికి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కోచైర్మన్ మత్తి కమలాకరరావు సంఘీభావం తెలిపారు.
చల్లపల్లిలో వినూత్న నిరసన
చల్లపల్లిలో వినూత్న నిరసన చేపట్టారు. కొంతమందిని కేసీఆర్, కోదండరామ్, తెలంగాణ వాదులుగా పోల్చి సమైక్యాంధ్ర మేకను వారు బలిచ్చేందుకు సిద్ధపడగా సమైక్యాంధ్రవాదులుగా జేఏసీ నాయకులు ఆ మేకను రక్షించి విముక్తి కల్పించారు. ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పులో సమైక్యాంధ్రకు మద్ధతుగా రహదారిపై వంటావార్పు నిర్వహించారు. అనంతరం రహదారి పైనే భోజనాలు చేశారు. కైకలూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వె నక్కి నడుస్తూ నిరసన తెలిపారు.
గాంధీబొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన దీక్షలు 38వ రోజుకు చేరాయి. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కంభంపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. జగ్గయ్యపేట మున్సిపల్ సెంటర్‌లో పేట జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 20వ రోజు దీక్షల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు కూర్చున్నారు. హనుమాన్‌జంక్షన్‌లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరాయి. మాలమహానాడు ఆధ్వర్యంలో తీన్‌మార్ డప్పు వాయిద్యాలతో జంక్షన్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేశారు.
జాతీయ రహదారిపై కర్రసాము ప్రదర్శించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. గుడివాడలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 37వ రోజుకు చేరాయి. కాపవరం సర్పంచ్, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా పామర్రులో జరుగుతున్న రిలేదీక్షలలో పాల్గొన్నారు. జనార్ధనపురం శివారు టెలిఫోన్‌నగర్ కాలనీలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ జేఏసీ నిర్వహిస్తున్న రిలేదీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో హర్ష కరాటే స్కూల్ విద్యార్థులు సమైక్య నినాదాలు చేస్తూ కరాటే, పిరమిడ్లు వంటి విన్యాసాలతో నిరసన తెలిపారు.
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి..
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. వీరంకిలాకులో రోడ్డుపై యువకులు కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. పెడన పట్టణంలో ఎంఎస్‌హెచ్‌ఎఫ్ కమిటీ బైలం సాహేబ్ మహేల పెద్దలు బ్రహ్మపురం రైల్వే గేటు సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో రిలే దీక్ష శిబిరం కొనసాగింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడు జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. చనుబండలో ఆటో వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. నందిగామ గాంధీసెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి.
సమైక్యంగా ఉంచు..గణనాయకా.!
Published Mon, Sep 9 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement