జన ఉప్పెన | Cities, towns and villages is not a crowd Kadam | Sakshi
Sakshi News home page

జన ఉప్పెన

Published Fri, Sep 6 2013 3:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

Cities, towns and villages is not a crowd Kadam

రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు గర్జిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అన్ని గళాలూ ఏకమవుతున్నాయి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ జనం వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దీంతో రోడ్లన్నీ జనసంద్రాలవుతున్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, ఉయ్యూరు తర్వాత గురువారం చల్లపల్లిలో జనం కదలివచ్చారు. లక్షగళ గర్జనను విజయవంతం చేశారు.
 
సాక్షి, విజయవాడ : నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లో కూడా జనం కదం తొక్కుతున్నారు. లక్షగళ గర్జనలతో సమైక్యాంధ్రకు మద్దతును బలంగా చాటుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గురువారం చల్లపల్లిలో నిర్వహించిన లక్షగళ గర్జనతో రోడ్లు జనంతో నిండిపోయాయి. సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న కార్యాచరణకు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. 11, 12 తేదీలలో 48 గంటల బంద్ జరుగుతుందని తెలిపింది.

ఈ బంద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆటో వర్కర్స్, ఓనర్స్ యూనియన్లు పాల్గొనాలని కోరింది. మచిలీపట్నం కోనేరుసెంటరులో ఏర్పాటుచేసిన రిలే దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సందర్శించి సంఘీభావం తెలిపారు. రిలేదీక్ష శిబిరంలోనే గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది తాడు లాగుడు ఆట ఆడి నిరసన తెలిపారు. సెయింట్ ప్రాన్సిస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ జరిపి, మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
 
జగ్గయ్యపేటలో జాతీయ జెండాతో నిరసన

 జగ్గయ్యపేటలోని ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయజెండాతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కళ్లకు గంతలు కట్టుకుని చేసిన బైక్ ర్యాలీకి స్థానిక న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. శ్రావణమాసం ముగింపును పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి పలువురు భక్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో రథోత్సవం నిర్వహించారు. వత్సవాయిలో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు గురుపూజోత్సవం జరిపారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు పదోరోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో 29వ రోజు, న్యాయవాదుల ఆధ్వర్యంలో 18వ రోజు దీక్షలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం కొనసాగింది.

 కైకలూరులో 30వ రోజుకు చేరిన దీక్షలు..

 కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు గురువారానికి 30వ రోజుకు చేరాయి. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలు 23వ రోజూ కొనసాగాయి. ఉపాధ్యాయులు రిలే దీక్షలలో కూర్చున్నారు. పాత్రికేయులు పలువురు ఉపాధ్యాయులకు టీచర్స్‌డే సందర్భంగా రోడ్డుపై సన్మానం చేశారు. కలిదిండి మండలంలో తాపీ వర్కర్లు దీక్షలు చేశారు. ముదినేపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు జరిపారు. మండవల్లిలో టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పూ, రిలే దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు.

గుడివాడలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు స్థానిక నెహ్రూచౌక్ వద్ద భారీ ధర్నా జరిపారు. ది గుడివాడ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెయింటర్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నెహ్రూచౌక్‌లో జై..సమైక్యాంధ్ర అంటూ పెయింట్లు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే సీమాంధ్ర ప్రజల జీవితాలు కొడిగట్టిన దీపాలుగా మారతాయని వైఎస్సార్ సీపీ నేత బేతపూడి నవరత్నరాజు అన్నారు. జనార్ధనపురం శివారు టెలిఫోన్‌నగర్‌లో ఉపాధ్యాయ జేఏసీ నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్ష కార్యక్రమంలో డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంచికచర్ల తాలూకా యూనిట్ ఉద్యోగులు జాతీయ రహదారిపై ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు.
 
 ఆకట్టుకున్న కళాకారుల నిరసన..

 కంచికచర్ల, వీరులపాడు మండలాల కళాకారుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుతల్లి వేషధారణలతోపాటు పలు రకాల వేషాలతో ట్రాక్టర్లపై ఊరేగుతూ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ శాలివాహన కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై సారెలు ఏర్పాటు చేసి కుండలు తయారుచేస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. జీ.కొండూరులో రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు ఆటలతో నిరసన తెలిపారు.

 విజయవాడలో 500 బైక్‌లతో ర్యాలీ

 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ది విజయవాడ వెహికల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసరపల్లి నుంచి విజయవాడకు 500 మోటారు బైక్‌లతో ఏలూరు రోడ్డు మీదుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎలా ఉంటుందో బ్యానర్లు ప్రదర్శిస్తూ విజయవాడలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు ర్యాలీ జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement