అనకాపల్లి, న్యూస్‌లైన్: ఊహించని పరిణామాన్ని బీజేపీ నేతలు ఎదుర్కొన్నారు. ఉద్యమం ఉధృతి సమయంలో విభజనకు కట్టుబడిన పార్టీగా ముద్రపడినందున సమైక్య వాదుల ఆగ్రహానికి గురయ్యారు. స్థానిక వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు ఆవరణలో శుక్రవారం బీజేపీ జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశం ప్రశాంతంగా మొదలయింది. మూడునెలలకొకసారి నిర్వహించాలి. విభజన ఆందోళన నేపథ్యంలో ఐదు నెలలు విరామం అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో ఉత్తరాంధ్ర వెనుకుబాటుతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను చర్చించి అధిష్టానానికి తెలియపరిచేందుకు నిర్ణయించామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా బీజేపీ సమావేశం జరుగుతున్నదని తెలుసుకున్న ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అక్కడికి వెళ్లి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. సమావేశ మందిరంలోని కొందరి పోకడతో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య వాదోపవాదం,తోపులాట చోటుచేసుకుంది. ఇది తెలుసుకున్న పట్టణంలోని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పెద్ద ఎత్తున సమావేశ మందిరంలోకి దూసుకువెళ్లారు.
తక్షణం బీజేపీ నాయకులు సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పట్టణ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా కుదుట పడలేదు. ఉద్రిక్తంగా మారింది. కంభంపాటి హరిబాబు సన్నిహితులతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తన్నులు తినడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి బీజేపీ డౌన్ డౌన్ .. హరిబాబు గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.
పరిస్థితి చేయిదాటిపోతోందని అవగతం చేసుకున్న పోలీసులు హరిబాబుతో పాటు ఇతర నాయకులను సమావేశ మందిరం నుంచి కిందకు తీసుకువచ్చారు. రెచ్చిపోయిన సమైక్యవాదులు కోడిగుడ్లు విసిరి వాహనాలకు అడ్డుగా నిలిచారు. పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో హరిబాబు కారు అద్దాలు పగిలాయి. అర్ధంతరంగా సమావేశం ముగిసింది. ఎటువంటి తీర్మానాలు లేకుండానే అంతా వెళ్లిపోయారు.
ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమా వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, జిల్లా ఇన్‌చార్జి మళ్ల వెంకటరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండారు సన్యాసినాయుడు, కార్యదర్శి గొంతిన భక్తసాయిరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజకుమారి, పుట్టా గంగయ్యతో పాటు గోవిందరావు, కొణతాల అప్పలరాజు తదితరులు పాల్గొని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆందోళనలో ఎన్‌జీవోల అధ్యక్షుడు మాదేటి పరమేశ్వరరావు, ఉపాధ్యాయులు కె.ఎన్.వి.సత్యనారాయణ, బుద్ద కాశీ, పీలా రవి, దూలం గోపీ, పి.వి.రమణ, దాడి జయవీర్, మర్రాశేఖర్, శంకర్‌బాబు, సిరసపల్లికాశీ, మళ్ల అబ్బాయినాయుడు, ఎస్..ఎల్.టి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నేతలపై దాడి
Published Sat, Sep 14 2013 2:10 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement