భోపాల్: దురుసు ప్రవర్తనతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా భాగ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్‌దా ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ అధికారి చెంపలు పగలకొట్టాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి.
ఏం జరిగిందంటే... శుక్రవారం రాత్రి ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే దేవ్‌దా మేనల్లుడు, అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ల బాటిల్‌ను దొంగతనం చేశాడు. ఇంతలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి.. అతన్ని నిలువరించాడు. విషయం తెలిసిన దేవ్‌దా కొడుకు స్టేషన్‌కు వచ్చి అతన్ని తీసుకెళ్లేందుకు యత్నించగా, సంతోష్ మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. పైగా దొంగతనం చేయటం తప్పని వారితో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే దేవ్‌దా.. సంతోష్ చెంపలను చెడామడా వాయించాడు. ‘ఎంత ధైర్యం రా నీకు.. మా వాళ్లనే అడ్డుకుంటావా? చంపేస్తా ****..’ అంటూ అసభ్యపదజాలంతో అతనిపై దాడికి దిగాడు.
విచారణకు ఆదేశం... కాగా, అర్ధరాత్రి తర్వాత ఘటన జరిగినప్పటికీ స్థానిక మీడియా ఛానెళ్లలో ఈ వార్త అప్పటికే పాకిపోయింది. దీంతో పోలీసు శాఖ ఎమ్మెల్యే దేవ్‌దాపై కేసులు నమోదు చేసింది. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి, అధికారి విధికి విఘాతం కలిగించటం తదితర సెక్షన్ల కింద దేవ్‌దాపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అన్షుమన్ సింగ్ వెల్లడించారు. అయితే దేవ్‌దా మేనల్లుడు ఆ సమయంలో.. స్టేషన్‌కు ఎందుకొచ్చాడు? అన్న విషయంపై మాత్రం అధికారులు స్పందించకపోవటం కొసమెరుపు.
మా తప్పేం లేదు... ఇదిలా ఉంటే ఈ ఘటనలో తన తప్పేం లేదని ఎమ్మెల్యే దేవ్‌దా చెబుతున్నారు. తన అల్లుడిపై దాడి చేయటమే కాకుండా, అసభ్య పదజాలంతో కానిస్టేబుల్ సంతోష్ దూషించాడని, అది తట్టుకోలేకనే అతనిపై చెయ్యి చేసుకున్నానని దేవ్‌దా అంటున్నారు. మరోవైపు కానిస్టేబుల్ సంతోష్ తన తప్పు లేకున్నా ఎమ్మెల్యే దాడి చేశారని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. దేవాస్ జిల్లా బీజేపీ విభాగం చంపాలాల్ దేవ్‌దాను ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment