
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్(78)పై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పాపులారిటీ కోసమే అగ్నివేష్.. తనపై తానే దాడి చేయించుకున్నారని జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘దాడికి స్పాన్సర్ ఆయనే. పేరు కోసమే స్వయం ప్రేరేపిత దాడి చేయించున్నారు. ఆయన ఓ మోసగాడు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతిస్తుంటారు. అలాంటి వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు’ అని తెలిపారు. ‘ఆయన ట్రాక్ రికార్డు ఓసారి పరిశీలించండి. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరి ఆయనకు కొత్తేం కాదు. బహుశా అది మనసులో పెట్టుకునే ఎవరైనా ఆ పని చేసి ఉండొచ్చు’ అని మరో బీజేపీ నేత చెబుతున్నారు. (బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకిలా...?)
అయితే సీపీ సింగ్ 'వింత భాష్యం'పై ప్రతిపక్షాలు, అగ్నివేష్ మద్ధతుదారులు మండిపడుతున్నారు. జార్ఖండ్‌లోని పకూర్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన బయటకు వస్తుండగా.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేష్‌పై పిడిగుద్దులు గుప్పించింది. తనను హత్య చేసేందుకే ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగిందని అగ్నివేష్ చెబుతున్నారు. ఈ ఘటనపై రాంచీ హైకోర్టు రిటైర్జ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం కార్యకర్తలు తనపై దాడి చేసినట్టు రాంచీ పోలీస్ స్టేషన్‌లో.. ఈ స్వయం ప్రకటిత ఆధ్యాత్మికవేత్త స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీసహా పలువురు అగ్నివేష్‌కు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఘటన అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment