ఆర్టీసీలో ‘కేశినేని’ పాగా!?
అమరావతి: మూలిగే నక్క మీద తాటి కాయ పడడమంటే ఇదేనేమో. అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై కేశినేని ట్రావెల్స్ అదనపు భారాన్ని మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన కేశినేని ట్రావెల్స్‌ను ఇటీవల వివాదాస్పద రీతిలో మూసివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన అద్దె బస్సుల రూపంలో ఆర్టీసీలో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
నాని బ్లాక్ మెయిల్ రాజకీయాల ఒత్తిడికి తలొగ్గిన సీఎం చంద్రబాబు ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్ వద్ద దాదాపు 170 బస్సులు ఉన్నాయి. కండిషన్‌లో ఉన్న ఏసీ బస్సులు సుమారు 100 వరకు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఆయన వ్యూహాత్మకంగా ఆరు నెలల కిందట నుంచే పావులు కదుపుతున్నారు.
వాస్తవానికి ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను భరించే స్థితిలో లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీకి 11,865 బస్సులు ఉన్నాయి. అందులో ఏసీ బస్సులు 2,700, స్లీపర్ 5, డీలక్స్ 613, సూపర్ లగ్జరీ 752, ఎక్స్‌ప్రెస్‌లు 2,117, మిగిలినవి 5,678 మామూలు బస్సులు. ఏసీ బస్సులు ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం రూట్లలో నడుపుతున్నారు. వాస్తవానికి ఆరు నెలల క్రితం వరకు ఆర్టీసీలో ఏసీ అద్దె బస్సులు లేవు. తొలిసారిగా 21 ఇంద్ర ఏసీ బస్సులను ఆరు నెలల కిందటే అద్దెకు తీసుకున్నారు.
కేవలం కేశినేని ట్రావెల్స్ బస్సులకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తద్వారా ఓసారి ఏసీ బస్సులను అద్దెకు తీసుకునే విధానానికి ఆమోద ముద్ర వేశారు. అదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 100 ఏసీ బస్సులను ఆర్టీసీకి కట్టబెట్టాలని పావులు కదుపుతున్నారు.
త్వరలో టెండర్లు..
కేశినేని ట్రావెల్స్‌కు మార్గం సుగమం చేసేందుకు ఆర్టీసీ పెద్దలు ఇప్పటికే కార్యాచరణకు దిగారు. వేసవి సీజన్ కావడంతో ఆర్టీసీకి బస్సుల కొరత తీవ్రంగా ఉందనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదనే వాదనను టీడీపీ అనుకూల కార్మిక సంఘాల నేతలు బలంగా వినిపిస్తున్నారు. అద్దె బస్సులు తీసుకునేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించేలా ఎంపీ కేశినేని నాని పావులు కదుపుతున్నారు.
ఇందుకు సీఎం కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి.. ఆ తర్వాతి పరిణామాలను నాని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న తమ సంస్థను ఆర్టీసీ ద్వారా ఆదుకుంటానని సీఎం చంద్రబాబు వద్ద హామీ తీసుకున్న అనంతరమే ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో కేశినేని ట్రావెల్స్ బస్సులు ఆర్టీసీ షెడ్డులోకి చేరతాయని అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
ఆందోళనకు కార్మిక సంఘాలు సన్నద్ధం
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడల పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అద్దె బస్సుల భారంతో ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుందని కార్మికులు చెబుతున్నారు. అది చివరగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే కార్మిక సంఘాలు సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాయని ఓ కార్మిక సంఘం నేత ‘సాక్షి’కి తెలిపారు.