చొప్పదండిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కరీంనగర్: జిల్లాలోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కరీంనగర్ ఎస్పీ శివకుమార్ చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ మీడియాకు విడుదల చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. అనుమానితుల వివరాలను తెలియజేయమని ఆయన ప్రజలను కోరారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
చొప్పదండి ఎస్బీఐ శాఖలోకి శనివారం ఉదయం కొందరు దుండగులు ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి 40 లక్షల రూపాయలు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన బ్యాంక్కు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజర్తోపాటు సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దొంగలను గుర్తించారు. వారికోసం గాలింపు మొదలుపెట్టారు.