bank theft case
-
అర్ధరాత్రి అలజడి
నెల్లూరు (క్రైమ్): బ్యాంక్‌లో దొంగలు పడ్డారని అర్ధరాత్రి ఆటోమెటిక్ మెసేజ్‌లు బ్యాంక్ ఉన్నతాధికారులకు వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాంటిదేమి లేదని తెలియడంతో వెనుదిరిగారు. ఈ ఘటన కేవీఆర్పెట్రోల్ బంకు సమీపంలోని ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కేవీఆర్ పెట్రోల్‌బంకు సమీపంలో స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ఉంది. బ్యాంకు అధికారులు దొంగతనాలు నియంత్రణకు బ్యాంక్ లోపల క్యాష్చెస్ట్ల వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు, ఆటోమెటిక్ మెసేజ్ (వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్), కాల్ సెండింగ్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. క్యాష్‌చెస్ట్ వద్దకు ఎవరైనా వెళ్లినా, దొంగతనానికి యత్నించినా, లేదా దాని ముందుగా ఏదైనా (గాలికి పేపర్లు పడినా, ఎలుకలు తదితరాలు వెళ్లినా) కదలికలు జరిగినా వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌కు సమాచారం వెళుతుంది. ఫోను సైతం మోగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లో దొంగలు ఉన్నారన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అకౌంట్స్ సుజాతకు, చీఫ్ మేనేజర్ వివేకానందకు మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో వారు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. రాత్రి జనరల్ చెకింగ్ విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసాచారికి డయల్ 100 సిబ్బంది సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన రాత్రి విధుల్లో ఉన్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డితో పాటు నగరంలోని సిబ్బందిని, అన్నీ పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లను అప్రమత్తం చేశారు. వేమారెడ్డిని, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని హుటాహుటిన బ్యాంక్ వద్దకు రమ్మని ఆదేశించి విషయాన్ని జిల్లా ఎస్పీ పీహె చ్‌డీ రామకృష్ణ, క్రైం ఓఎస్డీ టీపీ విఠలేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంక్ ఉద్యోగులతో కలిసి బ్యాంకు తాళాలను తెరిపించారు. బ్యాంక్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లోపల ఎవరూ లేకపోవడం, క్యాష్ చెస్ట్ వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడాన్ని గుర్తించారు. ఎలుకలు అటుగా వెళ్లడం ద్వారా మెసేజ్ వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే నగరంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ అనుమానాస్పదంగా తారసపడిన వ్యక్తులను ఆపి వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులు డీఎస్పీ కె. శ్రీనివాసాచారి సూచించారు. -
పోలీసులకు సవాల్..!
భువనేశ్వర్ : అనుగుల్ పట్టణంలో రాత్రింబవళ్లు బ్యాంకు దోపిడీలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులపట్ల సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పట్ట పగలు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అనుగుల్ పట్టణం నడిబొడ్డులో బజార్ ఛక్ ఆంధ్రా బ్యాంకు శాఖ స్ట్రాంగ్ రూమ్ తెరిచి నగదు, బంగారం ఆభరణాలు, నగలు దోచుకున్న సంగతి విదితమే. ఈ సంఘటన నుంచి ప్రజలు కోలుకోక ముందే మరికొన్ని గంటల తేడాలో అర్ధరాత్రి స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంకు బొంతొలా శాఖను దుండగులు దోచుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఆంధ్రా బ్యాంకు దోపిడీని పురస్కరించుకుని దుండగులు జిల్లా పొలిమేరలు దాటకుండా నలువైపులా సరిహద్దు ప్రవేశ మార్గాల్ని సీల్ చేయించినట్లు అనుగుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మిత్రభాను మహాపాత్రో తెలిపారు. ఇరుగుపొరుగు జిల్లా పోలీసుల సహకారం కూడా కోరినట్లు ప్రకటించారు. ఇంతలో శుక్రవారం అర్ధరాత్రి భారతీయ స్టేట్ బ్యాంక్ బొంతొలా శాఖను దుండగులు దోచుకుని పోలీసులకు సవాల్ విసిరారు. అర్ధరాత్రి దుండగులు బ్యాంక్‌లో చొరబడి దోచుకుంటున్న తరుణంలో బ్యాంకులో ఏర్పాటు చేసిన అత్యవసర సైరన్ మోగడంతో దుండగులు ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. బ్యాంకు తలుపులు విరగ్గొట్టి లోనికి చొరబడి స్ట్రాంగ్ రూమ్ తెరిచినట్లు సమాచారం. దొరకని ఆధారాలు దుండగులు దోచుకున్న నగదు వగైరా వివరాలు స్పష్టం కావలసి ఉంది. శనివారం ఉదయం బ్యాంకు సిబ్బంది చేరుకుని స్థితిగతుల్ని పరిశీలించడం ప్రారంభించారు. వీరితో పాటు పోలీసుదర్యాప్తు బృందం కూడా విచారణ ప్రారంభించింది. దోపిడీ వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పట్టణంలో వరుస బ్యాంకు దోపిడీలకు సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం ఇంతవరకు ఎటువంటి ఆచూకీ సంపాదించిన జాడలు కనిపించడం లేదు. -
సత్య టైమ్ బాగోలేదు!
కోటి రూపాయల బ్యాంక్ దొంగతనం జరిగింది. ఆ డబ్బును దొంగల దగ్గర్నుంచి ఒకతను దోచుకొని ఎవ్వరికీ తెలియని ఒకచోట దాచిపెట్టాడు. అదెక్కడ ఉందో చెప్పేందుకు ఒక చీటీ ఉంది. కానీ ఆ చీటీ కొన్ని ఊహించని పరిస్థితుల్లో సత్య ఫ్లాట్‌లోకి వచ్చిపడింది. సత్య తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే అమ్మాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. దొంగలు ఆ డబ్బు కోసమే తిరుగుతున్నారు. ఆ చీటీ గురించి వాళ్లకు తెలుసు. వాళ్లు సత్య ఇంటికి వెళతారు. ఆ చీటీ కోసం వెతుకుతారు. సత్యకు ఆ చీటీ గురించి తెలియదు కాబట్టి భయపడుతుంది. సత్య అప్పుడే షాపింగ్‌కి వెళ్లి తన ఫ్లాట్‌కి వచ్చేసింది. దొంగలు కూడా ఆమె వెనకాలే అపార్ట్మెంట్ వరకూ వచ్చారు. అందులో ఒకడు ఫ్లాట్ లోపలకు కూడా వచ్చాడు. సత్య అతణ్ని చూసి భయపడింది. అరిచింది. ‘‘ఎవరు మీరు?’’ అడిగింది. ‘‘కవరెక్కడ?’’ ఆ వచ్చినతను అడిగాడు.‘‘ఏ కవరూ?’’ అంది. అతను ఆమె మీద మీదకు వస్తున్నాడు. సత్య మరింత భయపడింది. వచ్చినతను సత్యను గట్టిగా కొట్టాడు. ఆమె డైనింగ్ టేబుల్ మీద పడిపోయింది. చుట్టూ చూసింది. దగ్గర్లో ఓ కత్తి కనిపించింది. ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది. ‘‘దగ్గరికి రావొద్దు. పొడిచేస్తాను..’’ అంది ఆ కత్తిని చూపిస్తూ. అతను ఆమె మీదకు రాబోయాడు. ఆమె చూస్కోకుండానే అతని కడుపులోకి కత్తి దించింది. అతను కిందపడి పోయాడు. ఆమె రక్తమంటిన కత్తిని చూస్తూ వణికిపోయి అలాగే నిలబడి ఉండిపోయింది. ఇంటి ఓనర్ అప్పుడే ఫ్లాట్‌కి వచ్చాడు. సత్య చేతిలో కత్తి. ఓ మూలన కత్తిపోట్లతో పడి ఉన్న ఓ మనిషి. ఇంటి ఓనర్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేలోపు సత్య అక్కణ్నుంచి పారిపోయి, ఒక హోటల్ దగ్గరికెళ్లి ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పింది ఆ ఫ్రెండ్‌కు. ఐదు నిమిషాల్లో ఆ ఫ్రెండ్‌ను తనను కలవమని బతిమిలాడుకుంది. ఆ హోటల్లో సత్య తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు దగ్గర్లో ఓ ఐదుగురు ఆకతాయిలు కూర్చొని సత్యను కామెంట్ చేస్తున్నారు. ఆమె చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నారు. బతిమిలాడినా వదలట్లేదు. సత్యకు భయం పెరిగిపోయింది. వాళ్లంతా రౌడీల్లా ఉన్నారు. ఆ హోటల్లోనే వీళ్లకు వెనకవైపు కూర్చున్న చందు లేచి, సత్య దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆ రౌడీ గ్యాంగ్‌లో లీడర్లా కనిపిస్తున్న వ్యక్తిపై చెయ్యేసి, ‘‘ఎందుకయ్యా! అమ్మాయిని అలా అనవసరంగా గొడవ చేస్తారు. వదిలేయండి..’’ అన్నాడు. నువ్వు వెళ్లిపో అన్నట్టు సత్య వైపు చూశాడు. సత్య వెళ్లిపోబోతూంటే వాళ్లు మళ్లీ అడ్డుకున్నారు. ‘‘చెప్పేది విను. వదిలెయ్..’’ అన్నాడు చందు. ఆ రౌడీ లీడర్ చందు షర్ట్ పట్టుకున్నాడు. చందు వాడి చేతిని అలాగే షర్టుపైనుంచి తప్పిస్తూ కడుపులో రెండు గుద్దులు గుద్దాడు. ఆ గ్యాంగ్ అందర్నీ అలాగే నాలుగు దెబ్బలు కొట్టాడు. సత్య చందుకి వెనకొచ్చి నిలబడి భయపడుతూ చూస్తోంది ఇదంతా. ఆ రౌడీ గ్యాంగ్ అంతా పారిపోయింది. సత్య ఆగకుండా చందుకు థ్యాంక్స్ చెబుతూ పోతోంది. ఫర్వాలేదంటూ చందు సమాధానమిస్తున్నాడు. ‘‘పొద్దుణ్నించీ టైమ్ బాగోలేదండీ..’’ అంటూ సత్య ఏదో చెబుతూ ఉండగానే, పోలీసులు ఆ హోటల్‌కు వచ్చేశారు. చందు సత్య మెడపై కత్తిపెట్టి, అట్నుంచటే పోలీసులకు అందకుండా, సత్యతో కలిసి బయటకు పరుగుతీశాడు. ఆ హోటల్ పార్కింగ్ ఏరియాలో దొరికిన బండేస్కొని, వెనక సత్యను కూర్చొబెట్టుకొని బండిని వేగంగా తీసుకెళ్తూనే ఉన్నాడు చందు. అలా వెళ్తూ వెళ్తూ ఊరు దాటేశారు. ఇంకేదో ఊరొచ్చింది.అడవిని ఆనుకొని ఉన్న ఊరది. బండి అక్కడే పడేశారు. పోలీసులు వెంట పడుతూనే ఉన్నారు. వాళ్లకు కనబడకుండా అడవి లోపలికి వెళ్లిపోయారిద్దరూ. ‘‘అసలు పోలీసుల్ని చూసి మీరెందుకు పారిపోతున్నారు?’’ అడిగింది సత్య. ‘‘చాలా దూరం వచ్చేసినట్టున్నామే! తొందరగా వెళితే బెటర్. లేదంటే చీకటి పడిపోతుంది. మోటార్ బైక్ కూడా లేదు.’’‘‘నేనడిగిందీ.. పోలీసుల్ని చూసి మీరెందుకు పారిపోతున్నారని..’’ చందు వినపడనట్టు ముఖం పెట్టాడు. సత్య మళ్లీ అడిగింది. ‘‘నేనో దొంగని.’’ అన్నాడు చందు, చాలా నెమ్మదిగా. షాకయి చూస్తూ నిలబడింది సత్య. ‘‘చిన్నతనంలో మా అమ్మకు జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కనీసం రెండు వేలు అవుతుంది అన్నారు. అయిన వాళ్లందరి దగ్గరికీ వెళ్లాను. ఎవరూ నాకు హెల్ప్ చెయ్యలేదు. అప్పుడు ఏదో అయిపోతుందన్న భయంలో మెడికల్ స్టోర్‌లో మందులు దొంగతనం చేస్తుండగా పోలీసులు నన్ను పట్టుకొని బాస్టల్స్కూల్లో పెట్టారు. ఆ సిట్యుయేషన్లో తప్పనిసరై నేను దొంగగా మారాను..’’ చందు చెప్పిన కట్టు కథంతా విన్న సత్య, ‘‘ఈ సినిమా నేను చూశా..’’ అంది. ‘‘సినిమానా?’’‘‘అహా.. మీరు చెప్తా ఉంటే నాకు ముందుగానే అర్థమవుతోంది. ఏదో సినిమాలో.. ఇలాగే..’’ ‘‘ఛ! మీ డబ్బున్న వాళ్లందరూ ఇంతేనండీ.. నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీకు సినిమాలా కనిపిస్తోందా?’’ చందు నాటకీయంగా ప్రశ్నించాడు. సత్య చందుకు అంతకుముందు హోటల్లో థ్యాంక్స్ చెప్పినన్ని సార్లు, ఇప్పుడు సారీ చెప్పింది. ‘‘మీ పేరేంటండీ?’’ అనడిగింది కాసేపాగి.‘‘చందు..’’‘‘ఐ యామ్ సత్య..’’ వాళ్లిద్దరూ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయమైన ఆ సమయానికి సూర్యుడు దిగిపోతున్నాడు. ఇంకాసేపట్లో చీకటి కప్పేసుకుంటుంది. పోలీసులు ఆ దార్లో ఇంకా ఈ ఇద్దరి కోసం వెతుకుతూనే ఉన్నారు. సత్య ఫ్లాట్‌లో ఉన్న కవర్ కోసం దొంగలు వెతుకుతూనే ఉన్నారు. ఆ కవరేంటో సత్యకి, ఆ కవర్ గొడవ ఒకటి జరిగిందని చందుకి అప్పటికి తెలియదు. -
చొప్పదండి బ్యాంక్ చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం
కరీంనగర్: జిల్లాలోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కరీంనగర్ ఎస్పీ శివకుమార్ చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ మీడియాకు విడుదల చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. అనుమానితుల వివరాలను తెలియజేయమని ఆయన ప్రజలను కోరారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. చొప్పదండి ఎస్బీఐ శాఖలోకి శనివారం ఉదయం కొందరు దుండగులు ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి 40 లక్షల రూపాయలు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌తోపాటు సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దొంగలను గుర్తించారు. వారికోసం గాలింపు మొదలుపెట్టారు.