దోపిడీకి గురైన భారతీయ స్టేట్‌బ్యాంక్ బొంతొలా శాఖ
భువనేశ్వర్ : అనుగుల్ పట్టణంలో రాత్రింబవళ్లు బ్యాంకు దోపిడీలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులపట్ల సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పట్ట పగలు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అనుగుల్ పట్టణం నడిబొడ్డులో బజార్ ఛక్ ఆంధ్రా బ్యాంకు శాఖ స్ట్రాంగ్ రూమ్ తెరిచి నగదు, బంగారం ఆభరణాలు, నగలు దోచుకున్న సంగతి విదితమే. ఈ సంఘటన నుంచి ప్రజలు కోలుకోక ముందే మరికొన్ని గంటల తేడాలో అర్ధరాత్రి స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంకు బొంతొలా శాఖను దుండగులు దోచుకున్నారు.
శుక్రవారం ఉదయం జరిగిన ఆంధ్రా బ్యాంకు దోపిడీని పురస్కరించుకుని దుండగులు జిల్లా పొలిమేరలు దాటకుండా నలువైపులా సరిహద్దు ప్రవేశ మార్గాల్ని సీల్ చేయించినట్లు అనుగుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మిత్రభాను మహాపాత్రో తెలిపారు. ఇరుగుపొరుగు జిల్లా పోలీసుల సహకారం కూడా కోరినట్లు ప్రకటించారు. ఇంతలో శుక్రవారం అర్ధరాత్రి భారతీయ స్టేట్ బ్యాంక్ బొంతొలా శాఖను దుండగులు దోచుకుని పోలీసులకు సవాల్ విసిరారు. అర్ధరాత్రి దుండగులు బ్యాంక్‌లో చొరబడి దోచుకుంటున్న తరుణంలో బ్యాంకులో ఏర్పాటు చేసిన అత్యవసర సైరన్ మోగడంతో దుండగులు ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. బ్యాంకు తలుపులు విరగ్గొట్టి లోనికి చొరబడి స్ట్రాంగ్ రూమ్ తెరిచినట్లు సమాచారం.
దొరకని ఆధారాలు దుండగులు దోచుకున్న నగదు వగైరా వివరాలు స్పష్టం కావలసి ఉంది. శనివారం ఉదయం బ్యాంకు సిబ్బంది చేరుకుని స్థితిగతుల్ని పరిశీలించడం ప్రారంభించారు. వీరితో పాటు పోలీసుదర్యాప్తు బృందం కూడా విచారణ ప్రారంభించింది. దోపిడీ వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పట్టణంలో వరుస బ్యాంకు దోపిడీలకు సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం ఇంతవరకు ఎటువంటి ఆచూకీ సంపాదించిన జాడలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment