కోటి రూపాయల బ్యాంక్ దొంగతనం జరిగింది. ఆ డబ్బును దొంగల దగ్గర్నుంచి ఒకతను దోచుకొని ఎవ్వరికీ తెలియని ఒకచోట దాచిపెట్టాడు. అదెక్కడ ఉందో చెప్పేందుకు ఒక చీటీ ఉంది. కానీ ఆ చీటీ కొన్ని ఊహించని పరిస్థితుల్లో సత్య ఫ్లాట్‌లోకి వచ్చిపడింది. సత్య తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే అమ్మాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. దొంగలు ఆ డబ్బు కోసమే తిరుగుతున్నారు. ఆ చీటీ గురించి వాళ్లకు తెలుసు. వాళ్లు సత్య ఇంటికి వెళతారు. ఆ చీటీ కోసం వెతుకుతారు. సత్యకు ఆ చీటీ గురించి తెలియదు కాబట్టి భయపడుతుంది. సత్య అప్పుడే షాపింగ్‌కి వెళ్లి తన ఫ్లాట్‌కి వచ్చేసింది. దొంగలు కూడా ఆమె వెనకాలే అపార్ట్‌మెంట్ వరకూ వచ్చారు. అందులో ఒకడు ఫ్లాట్ లోపలకు కూడా వచ్చాడు. సత్య అతణ్ని చూసి భయపడింది. అరిచింది. ‘‘ఎవరు మీరు?’’ అడిగింది. ‘‘కవరెక్కడ?’’ ఆ వచ్చినతను అడిగాడు.‘‘ఏ కవరూ?’’ అంది. అతను ఆమె మీద మీదకు వస్తున్నాడు. సత్య మరింత భయపడింది. వచ్చినతను సత్యను గట్టిగా కొట్టాడు. ఆమె డైనింగ్ టేబుల్ మీద పడిపోయింది. చుట్టూ చూసింది. దగ్గర్లో ఓ కత్తి కనిపించింది. ఆ కత్తిని చేతిలోకి తీసుకుంది.
‘‘దగ్గరికి రావొద్దు. పొడిచేస్తాను..’’ అంది ఆ కత్తిని చూపిస్తూ. అతను ఆమె మీదకు రాబోయాడు. ఆమె చూస్కోకుండానే అతని కడుపులోకి కత్తి దించింది. అతను కిందపడి పోయాడు. ఆమె రక్తమంటిన కత్తిని చూస్తూ వణికిపోయి అలాగే నిలబడి ఉండిపోయింది. ఇంటి ఓనర్ అప్పుడే ఫ్లాట్‌కి వచ్చాడు. సత్య చేతిలో కత్తి. ఓ మూలన కత్తిపోట్లతో పడి ఉన్న ఓ మనిషి. ఇంటి ఓనర్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేలోపు సత్య అక్కణ్నుంచి పారిపోయి, ఒక హోటల్ దగ్గరికెళ్లి ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పింది ఆ ఫ్రెండ్‌కు. ఐదు నిమిషాల్లో ఆ ఫ్రెండ్‌ను తనను కలవమని బతిమిలాడుకుంది. ఆ హోటల్లో సత్య తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోంది. ఆమెకు దగ్గర్లో ఓ ఐదుగురు ఆకతాయిలు కూర్చొని సత్యను కామెంట్ చేస్తున్నారు. ఆమె చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నారు. బతిమిలాడినా వదలట్లేదు. సత్యకు భయం పెరిగిపోయింది. వాళ్లంతా రౌడీల్లా ఉన్నారు. ఆ హోటల్లోనే వీళ్లకు వెనకవైపు కూర్చున్న చందు లేచి, సత్య దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆ రౌడీ గ్యాంగ్‌లో లీడర్‌లా కనిపిస్తున్న వ్యక్తిపై చెయ్యేసి, ‘‘ఎందుకయ్యా! అమ్మాయిని అలా అనవసరంగా గొడవ చేస్తారు. వదిలేయండి..’’ అన్నాడు. నువ్వు వెళ్లిపో అన్నట్టు సత్య వైపు చూశాడు. సత్య వెళ్లిపోబోతూంటే వాళ్లు మళ్లీ అడ్డుకున్నారు. ‘‘చెప్పేది విను. వదిలెయ్..’’ అన్నాడు చందు. ఆ రౌడీ లీడర్ చందు షర్ట్ పట్టుకున్నాడు. చందు వాడి చేతిని అలాగే షర్టుపైనుంచి తప్పిస్తూ కడుపులో రెండు గుద్దులు గుద్దాడు. ఆ గ్యాంగ్ అందర్నీ అలాగే నాలుగు దెబ్బలు కొట్టాడు. సత్య చందుకి వెనకొచ్చి నిలబడి భయపడుతూ చూస్తోంది ఇదంతా. ఆ రౌడీ గ్యాంగ్ అంతా పారిపోయింది. సత్య ఆగకుండా చందుకు థ్యాంక్స్ చెబుతూ పోతోంది. ఫర్వాలేదంటూ చందు సమాధానమిస్తున్నాడు.
‘‘పొద్దుణ్నించీ టైమ్ బాగోలేదండీ..’’ అంటూ సత్య ఏదో చెబుతూ ఉండగానే, పోలీసులు ఆ హోటల్‌కు వచ్చేశారు. చందు సత్య మెడపై కత్తిపెట్టి, అట్నుంచటే పోలీసులకు అందకుండా, సత్యతో కలిసి బయటకు పరుగుతీశాడు. ఆ హోటల్ పార్కింగ్ ఏరియాలో దొరికిన బండేస్కొని, వెనక సత్యను కూర్చొబెట్టుకొని బండిని వేగంగా తీసుకెళ్తూనే ఉన్నాడు చందు. అలా వెళ్తూ వెళ్తూ ఊరు దాటేశారు. ఇంకేదో ఊరొచ్చింది.అడవిని ఆనుకొని ఉన్న ఊరది. బండి అక్కడే పడేశారు. పోలీసులు వెంట పడుతూనే ఉన్నారు. వాళ్లకు కనబడకుండా అడవి లోపలికి వెళ్లిపోయారిద్దరూ. ‘‘అసలు పోలీసుల్ని చూసి మీరెందుకు పారిపోతున్నారు?’’ అడిగింది సత్య. ‘‘చాలా దూరం వచ్చేసినట్టున్నామే! తొందరగా వెళితే బెటర్. లేదంటే చీకటి పడిపోతుంది. మోటార్ బైక్ కూడా లేదు.’’‘‘నేనడిగిందీ.. పోలీసుల్ని చూసి మీరెందుకు పారిపోతున్నారని..’’ చందు వినపడనట్టు ముఖం పెట్టాడు. సత్య మళ్లీ అడిగింది.
‘‘నేనో దొంగని.’’ అన్నాడు చందు, చాలా నెమ్మదిగా. షాకయి చూస్తూ నిలబడింది సత్య. ‘‘చిన్నతనంలో మా అమ్మకు జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కనీసం రెండు వేలు అవుతుంది అన్నారు. అయిన వాళ్లందరి దగ్గరికీ వెళ్లాను. ఎవరూ నాకు హెల్ప్ చెయ్యలేదు. అప్పుడు ఏదో అయిపోతుందన్న భయంలో మెడికల్ స్టోర్‌లో మందులు దొంగతనం చేస్తుండగా పోలీసులు నన్ను పట్టుకొని బాస్టల్‌స్కూల్లో పెట్టారు. ఆ సిట్యుయేషన్‌లో తప్పనిసరై నేను దొంగగా మారాను..’’ చందు చెప్పిన కట్టు కథంతా విన్న సత్య, ‘‘ఈ సినిమా నేను చూశా..’’ అంది. ‘‘సినిమానా?’’‘‘అహా.. మీరు చెప్తా ఉంటే నాకు ముందుగానే అర్థమవుతోంది. ఏదో సినిమాలో.. ఇలాగే..’’ ‘‘ఛ! మీ డబ్బున్న వాళ్లందరూ ఇంతేనండీ.. నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీకు సినిమాలా కనిపిస్తోందా?’’ చందు నాటకీయంగా ప్రశ్నించాడు. సత్య చందుకు అంతకుముందు హోటల్లో థ్యాంక్స్ చెప్పినన్ని సార్లు, ఇప్పుడు సారీ చెప్పింది. ‘‘మీ పేరేంటండీ?’’ అనడిగింది కాసేపాగి.‘‘చందు..’’‘‘ఐ యామ్ సత్య..’’ వాళ్లిద్దరూ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయమైన ఆ సమయానికి సూర్యుడు దిగిపోతున్నాడు. ఇంకాసేపట్లో చీకటి కప్పేసుకుంటుంది. పోలీసులు ఆ దార్లో ఇంకా ఈ ఇద్దరి కోసం వెతుకుతూనే ఉన్నారు. సత్య ఫ్లాట్‌లో ఉన్న కవర్ కోసం దొంగలు వెతుకుతూనే ఉన్నారు. ఆ కవరేంటో సత్యకి, ఆ కవర్ గొడవ ఒకటి జరిగిందని చందుకి అప్పటికి తెలియదు.
సత్య టైమ్ బాగోలేదు!
Published Sun, Mar 11 2018 12:53 AM | Last Updated on Sun, Mar 11 2018 12:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment