ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
Published Fri, Oct 18 2013 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకున్న తమ కుటుంబ సభ్యులను తక్షణమే వదిలిపెట్టాలని ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై గురువారం పలువురు మహిళలు రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంనగరంలోని ముస్తఫానగర్ సెంటర్‌లో ఐదు రోజుల క్రితం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఆటోవాలాలు శ్రీరామ్‌హిల్స్ కాలనీకి వెళ్లి ద్విచక్ర వాహనదారులను తీవ్రంగా కొట్టారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు బాధ్యులుగా భావిస్తూ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుతో సంబంధం లేని పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లు మార్చి తిప్పుతూ హింసిస్తున్నారని ముస్తఫానగర్‌కు చెందిన పలువురు మహిళలు బుధవారం రాత్రి స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్సై గణేష్ వారికి సర్ధిచెప్పి గురువారం ఉదయం 10 గంటల వరకు విడిచిపెడతామని హామీ ఇచ్చారు. కానీ వారిని వదలకపోవడంతో గురువారం పలువురు మహిళలు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ వారిని చూపించాలని వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్సై గణేష్ అక్కడికి చేరుకుని సాయంత్రానికి వారిని వదిలిపెడతామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.
Advertisement
Advertisement