
నిందితులైన సత్యవతి, ఆమె కుమారుడు శ్రీధర్
సాక్షి, తిరుమలాయపాలెం: మండలంలోని బీరోలులో ఈ నెల 19న రాత్రి, కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యను, ఆమెకు సహకరించిన కొడుకుని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టు కు అప్పగించారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కూసుమంచి సీఐ మురళి తెలిపిన వివరాలు... మండలంలోని బీరోలు గ్రామస్తుడు బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందడంతో సత్యవతిని రెండోవివాహం చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె కలి గారు. కొన్నేళ్ల క్రితం, సత్యవతి తన భర్తను వదిలేసి ఖమ్మం వెళ్లింది. రెండేళ్ల క్రితం భర్త వద్దకు తిరిగొచ్చింది.
కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. భర్త సీతారాములుకు చెందిన 15 కుంటల భూమిలో ఏడు కుంటల భూమిని తన పేరిట పట్టా చేయించాలని భార్య సత్యవతి పట్టుబట్టింది. తనను ఏమాత్రం పట్టించుకోని సత్యవతి పేరిట భూమిని పట్టా చేసేందుకు సీతారాములు ససేమిరా అన్నాడు. దీంతో, అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి ఈ నెల 19న అర్ధరాత్రి వేళ సీతారాములును గొడ్డలి తో నరికి చంపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన సత్యవతిని, ఆమె కుమారు డు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచా రు. సమావేశంలో ఎస్‌ఐ సర్వయ్య పాల్గొన్నారు.